మరో రోజులో ‘ఖైదీ నంబర్ 150’ సినిమా ఫస్ట్ ప్రీమియర్ పడనున్న నేపధ్యంలో మీడియా వర్గీయులకు ఇంటర్వ్యూలు ఇచ్చే పనిలో ఉన్న మెగాస్టార్ చిరంజీవి, సినీ రాజకీయ విశేషాలను పంచుకున్నారు. సినిమాకు సంబంధించిన సంగతులను ఇప్పటికే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్పగా, రాజకీయంగా చిరు చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. ఎంతలా అంటే… ఇన్నాళ్ళు గడిచినా చిరు రాజకీయాలను ఏ మాత్రం ఒంట పట్టించుకోలేకపోయారా? లేక భవిష్యత్తులో జరగబోయేది చెప్పరా? ఇంతకీ మెగాస్టార్ గారు ఏమన్నారంటే…
రాబోయే రోజుల్లో రాజ్యం కాంగ్రెస్ దేనని, పెద్ద నోట్ల రద్దు అంశంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, మొసళ్ళను పట్టడం కోసం నీళ్ళన్నీ తోడేసారని, చిన్న చిన్న చేపలు ఎండిపోతున్నాయని, దేశవ్యాప్తంగా పేదలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని, 50, 60 రోజులు గడిచినా కష్టాలు తీరలేదని, దీంతో ప్రజలు కసి తీర్చుకోవాలన్న నిర్ణయంతో ఉన్నారని, అందుకే తదుపరి ఎన్నికలలో ప్రజలు యూపీఏకే పట్టం కడతారని ధీమా వ్యక్తం చేసారు మెగాస్టార్ గారు.
ఈ వ్యాఖ్యలు వింటేనే మెగాస్టార్ గారు రాజకీయంగా ఎంత పరిజ్ఞానం సాధించారో అర్ధమవుతుంది. చిరు చెప్పిన విషయాలలో పేదలు కష్టాలు పడిన మాట వాస్తవమే గానీ, ప్రస్తుతం నోట్ల కష్టాలు పూర్తిగా దూరమయ్యాయని ఏటీఎంలే చెప్తున్నాయి. ఎలాంటి క్యూ లైన్ లు లేకుండా యధావిధిగా ప్రజలు డబ్బులను విత్ డ్రాలు చేసుకుంటున్న వైనం బహుశా చిరు దాకా వెళ్లలేదేమో! అయినా చిరు చెప్పినట్లు ఒక్క నోట్ల రద్దు విషయంలో ఫెయిల్ అయినంత మాత్రాన ప్రజలు ప్రస్తుత ప్రభుత్వానికి తిలోదకాలు ఇచ్చేస్తారని భావిస్తే… 2004లో గెలిచిన కాంగ్రెస్ 2009లో ఘోరమైన ఓటమి పాలు కావాలి కదా?
రాజకీయాల్లో ఆశావహ స్పృహ ఉండాలి గానీ, అత్యాశ అనర్ధానికి చేటు చేస్తుందన్న విషయం ‘ప్రజారాజ్యం’ ద్వారా తెలుసుకున్న చిరంజీవి, ఆ విషయాన్ని పూర్తిగా మరిచినట్లున్నారు. మరొ మహత్తర విషయం ఏమిటంటే… ప్రజారాజ్యంకు అధికారం కట్టపెట్టినట్లయితే సామాజిక న్యాయం జరిగేదని చెప్పడం కొసమెరుపు. ఒక్కసారి అధికారం ఇవ్వలేకపోతే పార్టీని విలీనం చేయడమేనా సామాజిక న్యాయం అంటే? తను పోటీ చేస్తే ప్రజలు తిప్పికొడితే, ఇక ప్రజల పక్షాన కాకుండా అధికార పక్షాన చేరిపోవడమేనా సామాజిక న్యాయం అంటే? అని వస్తున్న ప్రశ్నలకు సమాధానం ఎవరు చెప్తారు మెగాస్టార్ గారు..?! అంటే పోరాడలేనన్న విషయాన్ని చిరు ఒప్పుకున్నట్లే కదా!
రాజకీయాలను చిరంజీవి ఎంత తక్కువగా మాట్లాడితే, తన 150వ సినిమాకు అంత శ్రేయస్కరం అన్న విషయం చిరంజీవి గుర్తించి మాట్లాడితే, అభిమానులు కూడా మద్దతు తెలుపుతారు. ఎందుకంటే… కాంగ్రెస్ లో ప్రజారాజ్యం విలీనం అన్న విషయం ఏ ఒక్క అభిమాని కూడా మద్దతు తెలిపిన విషయం కాదు. ఆఖరికి వీరాభిమానులు కూడా ఒకానొక సమయంలో రాజకీయంగా చిరంజీవిని ఏకరువు పెడుతూ విమర్శలు చేసిన వారే. అయితే ఇది బహిరంగంగా కాకపోవచ్చు గానీ, రోడ్ల గట్టులపై జరిగే రాజకీయ చర్చలలో ఇవన్నీ సర్వసాధారణంగా వినిపించే విషయాలే కదా.



