Metro to Vijayawada

వ్యాపార, రాజకీయ, సినీ రంగాలకు అత్యంత కీలకమైన నగరాలలో విజయవాడ నగరం ఒకటి. అయితే కృష్ణమ్మ అంచున, దుర్గమ్మ నీడలో ఏపీకి నడిబొడ్డున ఉన్న బెజవాడ ఏపీ రాజధాని అమరావతికి అత్యంత సమీప నగరం.

అయితే ఒక మహా నగరంగా రూపాంతరం చెందడానికి ఉండవలసిన లక్షణాలు, సౌకర్యాలు, వసతులు అన్ని కూడా విజయవాడ ఒడిలో మెండుగా ఉన్నప్పటికీ ఆనాటి రాజకీయ పరిస్థితుల దృష్ట్యా, ఆయా నాయకుల ఆలోచన లెక్క ప్రకారం విజయవాడ నగరం అనుకున్న స్థాయిలో అభివృద్ధిని చూడలేకపోయింది.

Also Read – నాగబాబు వ్యాఖ్యలు…వర్మకు కౌంటరా.?

ఒక చెడు మరో మంచికి పునాది అన్నట్టుగా రాష్ట్ర విభజన అనే దెబ్బ విజయవాడ ప్రగతి అనే కట్టుతో కొంతవరకు తగ్గుముఖం పట్టింది. అయితే వైసీపీ హయాంలో అభివృద్ధిని పక్కన పెట్టి బటన్ నొక్కే ప్రక్రియలో భాగంగా వైసీపీ మొదలు పెట్టిన మూడు ముక్కలాటలో విజయవాడ తనవంతు మూల్యం చెల్లించింది.

ఇక నేడు కూటమి ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రావడంతో గతంలో ఆగిపోయిన విజయవాడ అభివృద్ధి పనులను సీఎం చంద్రబాబు పట్టాలెక్కించే పనిలో పడ్డారు. ఇందులో భాగంగా విజయవాడకు మెట్రో సేవలు అంటూ నగరంలో మొదలైన పనులు అని మీడియాలో వినిపించే వార్త, కనిపిస్తున్న దృశ్యాలు బెజవాడ వాసులను ఊరిస్తున్నాయి.

Also Read – పవన్ లక్ష్యం గురి తప్పిందా.? గురి తప్పిస్తున్నారా.?

విజయవాడకు మెట్రో అనే వార్త వినడానికే ఇంత బాగుంది..ఇక ఆచరణ సాధ్యమయ్యి మెట్రో సేవలు ప్రజలకు అందుబాటులోకి రాగలిగితే ఇక కృష్ణా, గుంటూరు రెండు జిల్లాలలో వైసీపీ మెట్రో పునాదుల కింద సమాధి కావాల్సిందే. అవకాశం, హక్కు ఉండి కూడా ఇన్నాళ్లు అభివృద్ధి అనేపదానికి దూరమైన బెజవాడ వాసులకు ప్రభుత్వాలు ఇచ్చే పిప్పర్ మెంట్ బిళ్ళలు కూడా ఫైవ్ స్టార్ చాక్లెట్ మాదిరి ఆనందాన్ని అందిస్తాయి.

దీనికి చక్కటి ఉదాహరణ మొన్న తలసేమియా బాధితుల సహాయార్ధం ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన థమన్ మ్యూజికల్ కాన్సర్ట్. ఇదివరకెప్పుడు చూడని, వినని ఇటువంటి కార్యక్రమాలను బెజవాడకు పరిచయం చేసిన నారా వారి కుటుంబానికి విజయవాడ వాసులు ఫిదా అయ్యారనేది ఆ కార్యక్రమానికి వచ్చిన విశేష స్పందనతోనే అర్ధమవుతుంది.

Also Read – హాజరు కోసమే కేసీఆర్‌ వచ్చారట!


ఇక ఏకంగా మెట్రో అంటే అది వారికి చాల పెద్ద విషయమే అవుతుంది. అయితే నాటి టీడీపీ ప్రభుత్వం తమ హయాంలో ఇటువంటి ఆశలను చూపి బెజవాడ వాసుల ఆశలకు రెక్కలు తొడిగితే వైసీపీ వచ్చి తన ఫ్యాన్ రెక్కలతో ఆ ఆశలను విరిచేసింది. మరోమారు కూటమి ప్రభుత్వం విజయవాడకు మెట్రో ఆశలు రేపెడుతుంది. ఈసారైనా మెట్రో పిల్లర్ల పై విజయవాడ అందాలను చూసే అదృష్టం ఇక్కడి ప్రజలకు వస్తుందో లేదో చూడాలి.