ఎన్నికల రానంత వరకు అధికార పార్టీలు, వాటి నేతలు ఎన్ని ప్రగల్భాలైనా పలకగలరు. కానీ ఒకసారి ఎన్నికల గంట వినిపిస్తే అందరికీ వెన్నులో వణుకు మొదలవుతుంది. అప్పుడు మళ్ళీ హటాత్తుగా ప్రజల పట్ల గౌరవాభిమానాలు పెరిగిపోయి, ఇదివరకు ‘నీ దిక్కున్న చోట చెప్పుకో…’ అన్న మంత్రులే అప్పుడు ఎంతో వినయంగా పలకరిస్తుంటారు. ఇప్పుడు వైసీపీ పరిస్థితి కూడా సరిగ్గా ఇదే.
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు రావడంతో హటాత్తుగా వైసీపీ ప్రభుత్వానికి ఉపాధ్యాయుల కష్టాలు ఆర్డమైపోయాయి. బదిలీలకు కనీస గడువు 8 ఏళ్ళు ఉండాలని, అదీ కూడా వేసవి సెలవులలోనే బదిలీలు చేస్తే తమకూ, విద్యార్థులకు కూడా ఇబ్బందులు ఉండవని ఉపాధ్యాయులు ఎంత మొత్తుకొన్నా విద్యాశాఖామాత్యులు బొత్స సత్యనారాయణవారు పెద్దగా పట్టించుకోలేదు. ఐదేళ్ళకోసారి బదిలీలు తప్పనిసరి అని తేల్చి చెప్పేశారు.
కానీ ఇప్పుడు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు రావడంతో ఆ నిర్ణయం ఉపసంహరించుకొనేందుకు ప్రభుత్వం సిద్దం అయ్యింది. ఇదివరకు 5 ఏళ్ళ సర్వీసు పూర్తయినవారిని బదిలీ చేయాలంటూ చేసిన ఉత్తర్వులను పక్కన పెట్టేసి, 8 ఏళ్ళు సర్వీసు పూర్తయినవారి వివరాలను పంపించాలని విద్యాశాఖకు సీఎంవో ఉత్తర్వులు జారీ చేసింది!
అంటే ప్రభుత్వం నిర్ణయం తప్పు అని అంగీకరించి దానిని వెనక్కు తీసుకోవాలంటే ఎన్నికలు రావాలని స్పష్టమైంది. కనుక మూడు రాజధానులు విషయంలో వితండవాదం చేస్తున్న వైసీపీ ప్రభుత్వం నిర్ణయం ఉపసంహరించుకోవాలంటే, శాసనసభ ఎన్నికలు రావాలని స్పష్టమవుతోంది. కనుక ప్రజలు అంతవరకు ఓపిక పట్టాల్సిందే. అప్పటికైనా ఆ నిర్ణయం ఉపసంహరించుకొంటే మంచిదే లేకుంటే ప్రజలే వారికి అమరావతి కావాలో మూడు రాజధానులు కావాలో నిర్ణయించుకొని ఓట్లు వేస్తారు.



