తిరుమలపై తెలంగాణ నేతలు ఫోకస్.. దేనికో?

Konda Surekha

తిరుమలలో తెలంగాణ భక్తులు, తెలంగాణ ప్రముఖుల పట్ల టీటీడీ వివక్ష చూపుతోందంటూ బిఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్ ఇటీవల ఆరోపించారు. తిరుమల స్వామివారి సన్నిధిలో అందరూ సమానమే అనే స్పృహ లేకపోవడం వల్లనే కొందరు అతి చేస్తుంటారు. శ్రీనివాస్ గౌడ్‌కి టీటీడీ చేసిన మర్యాదలు సరిపోకనే ఇటువంటి ఆరోపణ చేశారని సరిపెట్టుకోవచ్చు.

కానీ ఇటీవల తరచూ వివాదస్పద వ్యాఖ్యలు చేస్తూ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కొత్త సమస్యలు తెచ్చిపెడుతున్న మంత్రి కొండా సురేఖ కూడా, నిన్న శ్రీశైలం వచ్చినప్పుడు శ్రీనివాస్ గౌడ్‌లాగే మాట్లాడటం విచిత్రంగా ఉంది.

ADVERTISEMENT

జగన్‌ హయంలో తెలంగాణ భక్తులు తిరుమలకు వచ్చినప్పుడు చాలా ఇబ్బందులు పడ్డారని, కానీ ఇప్పుడు సిఎం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తిరుమలకు వచ్చే తెలంగాణ భక్తులకు తగిన ప్రాధాన్యం, సౌకర్యాలు కల్పించాలని ఆమె కోరారు.

తెలంగాణ గుళ్ళు గోపురాలకు, గ్రామ గ్రామాన్న కళ్యాణ మండపాలు నిర్మించేందుకు టీటీడీ నిధులు కేటాయించాలని మంత్రి కొండా సురేఖ టీడీపీకి, ఏపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

టీటీడీ ప్రోటోకాల్ పాటించాల్సి ఉంటుంది కనుక ప్రముఖులు విచ్చేసినప్పుడు తగు రీతిలో వారికి మర్యాదలు చేసి పంపిస్తుంటుంది.

తిరుమలకు నిత్యం వివిద రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు వస్తుంటారు. కనుక వారందరికీ రాష్ట్రాల వారీగా మర్యాదలు, ప్రత్యేక సౌకర్యాలు కల్పించలేదు కదా?మరి తెలంగాణ భక్తులకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరడం దేనికి?

అయినా తెలంగాణ భక్తులు ఏనాడూ తిరుమలలో వివక్షకు గురయ్యామని పిర్యాదు చేయలేదు. నిజానికి టీటీడీకి అంత తీరిక, అవసరం రెండూ లేవు కూడా. టీటీడీ పాలక మండలిలో తెలంగాణతో సహా కొన్ని రాష్ట్రాల ప్రముఖులకు ఎప్పుడూ చోటు కల్పిస్తూనే ఉన్నారు కదా?

రాష్ట్ర విభజనలో తిరుమల ఏపీకి దక్కడంతో, తిరుమలకు పోటీగా, ధీటుగా తెలంగాణకు కూడా ఓ ఆలయం ఉండాలనే ఉద్దేశ్యంతోనే కేసీఆర్‌ సుమారు వెయ్యి కోట్లు ఖర్చు చేసి యాదాద్రిని అభివృద్ధి చేశారు.

యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారిని, బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారినీ, వేములవాడ రాజరాజేశ్వర స్వామివారిని, ఇంకా తెలంగాణలో ఉండే పలు పుణ్య క్షేత్రాలను దర్శించుకోవడానికి నిత్యం ఏపీతో సహా దేశం నలుమూలల నుంచి వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. మరి వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా చూడగలదా?మరి అటువంటప్పుడు తిరుమలలో మాకు ‘స్పెషల్ ట్రీట్‌మెంట్‌’ ఇవ్వాలని మంత్రి కొండా సురేఖ కోరడం సబబా?

అయినా ఈ విషయం గురించి తమ సిఎం, ఏపీ సిఎంతో మాట్లాడారని ఆమె స్వయంగా చెప్పినప్పుడు, ఆమె మీడియా ముందుకు వచ్చి ఈవిదంగా మాట్లాడటం అవసరమా? ఇప్పటికే అక్కినేని కుటుంబం గురించి నోరు జారినందుకు నేటికీ ఆమె కోర్టు చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. అది సరిపోదన్నట్లు మళ్ళీ ఇటువంటి మాటలతో కొత్త సమస్యలు సృష్టించుకోవడం అవసరమా?

ADVERTISEMENT
Latest Stories