బెంగళూరు ఐ‌టి కంపెనీలకు ఏపీ స్వాగతం పలుకుతోంది

బెంగళూరు కర్ణాటక రాష్ట్రానికి రాజధానిగా కంటే దేశంలో ఐ‌టి కంపెనీలకు రాజధానిగా ఎక్కువ ప్రసిద్ధి చెందింది. అక్కడ ఐ‌టి కంపెనీలలో విస్తృతంగా ఉద్యోగావకాశాలు ఉండటంతో దేశం నలుమూలల నుంచి ఐ‌టి నిపుణులు, సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లు అక్కడకి వచ్చి ఉద్యోగాలలో స్థిర పడ్డారు. నిత్యం వేలాదిమంది ఉద్యోగాల కోసం బెంగళూరుకి వలసలు వస్తూనే ఉన్నారు. ఐ‌టి కంపెనీల కారణంగానే బెంగళూరు నగరం శరవేగంగా అభివృద్ధి చెందింది.

కానీ కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో నిరుద్యోగ యువతని ఆకట్టుకోవడానికి ఐ‌టి కంపెనీలలో 75% ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలనే కొత్త ప్రతిపాదన చేసింది. వెంటనే ఇది చాలా ప్రమాదకరమైన ఆలోచన అని దాని వలన బెంగళూరు నుంచి ఐ‌టి కంపెనీలు పక్క రాష్ట్రాలకు తరలిపోయే ప్రమాదం ఉందని, కనుక ఈ ఆలోచన విరమించుకోవాలని సూచిస్తూ నాస్కామ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఓ లేఖ వ్రాసింది.

ADVERTISEMENT

ఇది ఏపీ మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్‌ దృష్టికి రావడంతో చురుకుగా స్పందిస్తూ సోషల్ మీడియాలో బెంగళూరు ఐ‌టి కంపెనీలకు ఆంధ్రప్రదేశ్‌ స్వాగతం పలుకుతోంది అంటూ నాస్కామ్ లేఖను ట్యాగ్ చేస్తూ ట్వీట్‌ చేశారు.

దానిలో “మీరు నిరాశ చెందడాన్ని మేము అర్ధం చేసుకోగలము. మీ ఐ‌టి కంపెనీలను, ఏఐ, డాటా సెంటర్లను వేరే చోటికి తరలించాలనుకుంటే మేము మీకు స్వాగతం పలుకుతున్నాము. ఇక్కడ అందమైన విశాఖ నగరంలో మీరు కంపెనీలు ఏర్పాటుకి అత్యుత్తమైన మౌలిక వసతులు కల్పించి, భారీగా ప్రోత్సాహకాలు అందించడానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సంసిద్దంగా ఉంది.

ఏపీలో మంచి నైపుణ్యం కలిగిన ఐ‌టి నిపుణులు కూడా ఉన్నారు. ప్రభుత్వం తరపు నుంచి ఐ‌టి కంపెనీలపై ఎటువంటి ఆంక్షలు ఉండవని హామీ ఇస్తున్నాను. కనుక ఆంధ్రప్రదేశ్‌కు తరలిరావాలనుకున్న ఐ‌టి కంపెనీలు మా ప్రభుత్వాన్ని సంప్రదించవచ్చు,” అని ట్వీట్‌ చేశారు.

నారా లోకేష్‌ మీడియాతో మాట్లాడుతూ, అవకాశాలు ఎక్కడో ఉండవు మన చుట్టూనే ఉంటాయని, వాటిని మనం గుర్తించగలిగితే చాలన్నారు. నిజమే కదా?

చంద్రబాబు నాయుడు సమస్యలను, సవాళ్ళను స్వీకరించి వాటి నుంచి అవకాశాలు సృష్టించుకోవాలని చెపుతుంటే, నారా లోకేష్‌ చుట్టూ ఉండే అవకాశాలను గుర్తించి సద్వినియోగం చేసుకోవాలని చెప్పడం చూస్తే తండ్రికి తగ్గ కుమారుడు అనిపించకమానదు.

ADVERTISEMENT
Latest Stories