పెద్దింటి బిడ్డ అంటే ఎంత మక్కువ!

Minister Narayana Son Nishith Latest Newsఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులుగా కంటే రాజధాని నిర్మాణాన్ని నెత్తిన వేసుకున్న పెద్ద మనిషిగా ప్రజలకు దగ్గర అయిన నారాయణ పుత్రుడి మరణంపై ప్రముఖ రాజకీయ నాయకులంతా స్పందించారు. ఇలాంటి విషాదకరమైన సంఘటన ఏ ఇంటా జరగకూడదు. కానీ బిగ్ షాట్స్ సుపుత్రులు వ్యవహరిస్తున్న విధానం ఈ సందర్భంగా మరోసారి హాట్ టాపిక్ అయ్యింది. కాస్త కటువుగా చెప్పినా… నిజాలను చెప్పడంలో దిట్ట అయిన టిడిపి ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా ప్రశంసించి తీరాలి.

“ధనవంతుల పిల్లల్లో విచ్చల విడితనం బాగా పెరిగిందని, ధనవంతుల పిల్లలు పబ్బులు, బార్లకు వెళ్తున్నారని ఆక్షేపించిన” జేసీ, రాత్రి 11 గంటల్లోపు పబ్బులు, బార్లు మూసేయాలని డిమాండ్ చేశారు. యువకులు తమ వంశాన్ని ఉద్దరిస్తారని భావిస్తే, ఇలా రోడ్డు ప్రమాదాలలో మృతి చెందారన్న వార్త తల్లితండ్రులకు జీర్ణించుకోవడం కష్టతరంగా మారుతోందని, యువకులు జాగ్రత్తగా ఉండాలని, అందుకు పెంపకం విషయంలో బాధ్యతలు తీసుకోవాలని సూచించారు. ఓ పెద్ద మనిషిగా జేసీ చేసిన వ్యాఖ్యలు బాగానే ఉన్నాయి, మరి వారి సుపుత్రుని విషయంలో జేసీ ఎంతవరకు ఈ నియమాలను పాటిస్తున్నారో తెలియదులేండి!

ADVERTISEMENT

ఇక, నారాయణ కొడుకు విషయానికి వస్తే… నిషిత్ మరణించిన తర్వాత యావత్ రాజకీయ లోకం కదిలింది. తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ నుండి ఎప్పుడూ స్పందించని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వరకు అందరూ తమ తమ సానుభూతి వ్యాఖ్యలను తెలియజేసారు. పెద్దింట బిడ్డలపై ప్రముఖులకు ఎంత మక్కువ ఉంటుందో ఈ సందర్భంగా సదరు రాజకీయ నేతలంతా రుజువు చేసారు. అయితే ఇలాంటి సంఘటనలు హైదరాబాద్ కు కొత్త కాదు. నగర ఔటర్ రింగ్ రోడ్ లలో కుర్రకారు మితిమీరిన వేగంతో వెళుతూ మృతి చెందిన ఘటనలు చాలానే నమోదయ్యాయి.

సామాన్యులు చనిపోతే పెద్దగా రియాక్షన్ రాకపోగా, ఎదురు కేసులు నమోదవుతాయి. మరి నారాయణ వంటి వారికి మాత్రం సానుభూతి లభిస్తోంది. తప్పులేదు… ఈ సమయంలో కావాల్సింది… చేయాల్సింది… అదే..! కానీ, పెద్దింట బిడ్డలకో న్యాయం, సామాన్యులకు మరో న్యాయం మాత్రం ఆహ్వానించదగ్గ పరిణామం కాదు. ఇంతదాకా ఎందుకు… నారాయణ కొడుకుకు తెలిపినంత సానుభూతి, మరి నిషిత్ తో పాటు మరణించిన స్నేహితుడి కుటుంబానికి ఎవరైనా ఇచ్చారా? అంటే తెల్లముఖం వేయాల్సిందే. అదే రాజకీయం..! అదే… పెద్దింట బిడ్డలపై చూపే మక్కువ.

అయితే పెద్దింటి బిడ్డలకు ఇలా జరగడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కోట శ్రీనివాసరావు, బాబూమోహన్ వంటి సినీ సెలబ్రిటీల పుత్రులు కూడా ఇలాగే ర్యాష్ డ్రైవింగ్ తో మరణించిన విషయం తెలిసిందే. సీరియల్స్ గా నమోదవుతున్న ఇలాంటి ఘటనలు చూసి కూడా నేర్చుకోకపోవడం… ఈ పెద్దింటి యువకెరటాలకు పరిపాటిగా మారుతోంది. తన తండ్రి ఇది, అది అని చూపించుకునే క్రమంలో సుపుత్రులు అహంకారాన్ని పక్కన పెట్టి, సభ్య సమాజంతో పాటు మనం ఒకరని మసలుకుంటే… ఇలాంటి జుగుప్సకరమైన సంఘటనలు చోటు చేసుకోవు.

ఒక్కసారి ఈ యాక్సిడెంట్ వీడియో చూస్తే… నారాయణ కొడుకు నిషిత్ చనిపోయాడన్న బాధ కంటే కూడా, ఇంత దారుణంగా సిటీలో డ్రైవింగ్ చేస్తున్నారా? అన్న విరక్తి కలగడం సహజం. సీసీ కెమెరాలలో రికార్డైన విధానాన్ని చూస్తే… రెప్పపాటు సమయంలో వచ్చిన కారు నేరుగా అలా గుద్దుకుని ఆగిపోయింది. ఉండొచ్చు గానీ, మితిమీరిన అత్యుత్సాహం అనర్ధాలకే దారి తీస్తుందన్న విషయం మంత్రి గారి కుటుంబంలో మరోసారి స్పష్టమైంది. ఇకనైనా… ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ప్రస్తుత తరం యువకులకు తల్లితండ్రులు హితబోధ చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.

ADVERTISEMENT
Latest Stories