ఎక్కువా వద్దు.. తక్కువా వద్దు.. నారాయణా!

Minister Narayana Speech

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి నిర్మాణం గురించి రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ ఈరోజు శాసనసభలో సుదీర్గ వివరణ ఇచ్చారు.

రాజధాని నిర్మాణానికి రూ.64,721.48 కోట్లు అవుతుందని అంచనా వేశామని, దానిలో ప్రపంచ బ్యాంక్, ఏడీబీ, కేఎఫ్‌డబ్ల్యూ బ్యాంకులు, హడ్కోల నుంచి మొత్తం రూ.31,400 కోట్లు సేకరిస్తున్నామని తెలిపారు. వివిద మార్గాల ద్వారా మిగిలిన సొమ్ము కూడా సమీకరించుకొని 2028నాటికల్లా అమరావతి నిర్మాణ పనులు పూర్తిచేస్తామని చెప్పారు.

ADVERTISEMENT

ముందుగా 50-70 శాతం నిర్మాణ పనులు పూర్తయిన అధికారుల భవనాలను ఏడాదిన్నరలో పూర్తి చేస్తామని చెప్పారు. మిగిలినవి రెండేళ్ళలో, హైకోర్టు, సచివాలయం, శాసనసభ మూడింటిని 2028 లోగా పూర్తిచేస్తామని మంత్రి నారాయణ చెప్పారు.

అమరావతిలో కార్యాలయాలు ఏర్పాటు చేసేందుకు మొత్తం 106 ప్రభుత్వ రంగ సంస్థలు, అనేక ప్రైవేట్ రంగ సంస్థలు సిద్దంగా ఉన్నాయని చెప్పారు. రాబోయే మూడేళ్ళ అన్ని విధాల అభివృద్ధి చేసిన ప్లాట్లను రాజధాని రైతులకు అప్పగిస్తామని మంత్రి నారాయణ చెప్పారు.

రాష్ట్ర విభజన తర్వాత ఆర్ధిక సమస్యలతో సతమతమవుతున్న ఆంధ్రప్రదేశ్‌కి లక్షల కోట్లు ఖర్చు చేసి ఓ అద్భుతమైన రాజధాని అమరావతి నిర్మిస్తామని సిఎం చంద్రబాబు నాయుడు చెప్పేవారు.

అమరావతిలో వేలకోట్లు ఖర్చు చేసి నిర్మించిన సచివాలయం, హైకోర్టు, శాసనసభ మూడు తాత్కాలిక భవనాలని పదేపదే చెప్పేవారు.

ఇటువంటి మాటలు, ‘సింగపూర్’ ప్రమేయం, పర్యటనలు ప్రజలలో అపనమ్మకం కలిగించేవి. జగన్మోహన్ రెడ్డి, వైసీపీ నేతలు, వారి మీడియా వీటిని హైలైట్ చేస్తూ ప్రజలలో అపోహలు, అనుమానాలు మరింత పెరిగేలా చేశారు.

టీడీపీ నేతలు ఇనసైడ్ ట్రేడింగ్‌కు పాల్పడుతూ అమరావతిలో వేలాది ఎకరాలు సొంత చేసుకున్నారని వైసీపీ దుష్ప్రచారం చేస్తూండేది. ఇవన్నీ 2019 ఎన్నికలలో టీడీపీ ఓటమికి కారణం అయ్యాయి.

కనుక మంత్రి నారాయణతో సహా మంత్రులు, మూడు పార్టీల నేతలు అమరావతి విషయంలో అతిగా మాట్లాడినా, అసలేమీ మాట్లాడకపోయినా కూడా ప్రమాదమే.

కనుక అమరావతి విషయంలో దాపరికం లేకుండా వాస్తవాలు ప్రజలకు వివరిస్తూ, ఎప్పటికప్పుడు అమరావతి నిర్మాణ పనుల పురోగతి గురించి రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తుండటం చాలా అవసరం.

ముఖ్యంగా అమరావతి విషయంలో వైసీపీ చేసే దుష్ప్రచారం వలన నష్టపోతామని కూటమి నేతలు గ్రహించారు కనుక దాని దుష్ప్రచారాన్ని ఎప్పటికప్పుడు ఖండించి ధీటుగా ఎదుర్కోవడం చాలా అవసరమే.

ADVERTISEMENT
Latest Stories