నాలుగు రోజుల బెయిల్‌: గొప్ప విషయమే.. నా?

YSRCP MP Mithun Reddy granted four-day interim bail in liquor scam case

మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్‌ అయ్యి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి నాలుగు రోజులు మధ్యంతర బెయిల్‌ లభించింది.

ఆయన ఎంపీ కనుక ఈ నెల 9న ఢిల్లీలో జరిగే ఉప రాష్ట్రపతి ఎన్నికలో ఓటు హక్కు వినియోగించుకునేందుకుగాను బెయిల్‌ కోరారు. దీనిపై ఈరోజు విచారణ జరిపిన ఏసీబీ కోర్టు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది. మళ్ళీ ఈ నెల 11వ తేదీన రాజమండ్రి వచ్చి పోలీసులకు లొంగిపోవాలని షరతు విధించింది.

ADVERTISEMENT

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డి ఆక్రమాస్తుల కేసులలో 16 నెలలు చంచల్ గూడా జైల్లో ఉండి వచ్చారు. వారితో పాటు పలువురి ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు, పారిశ్రామికవేత్తలు కూడా జైలుకి వెళ్ళి వచ్చారు.

ఆ తర్వాత జగన్‌ ముఖ్యమంత్రి కాగా, విజయసాయి రెడ్డి రాజ్యసభలో (ఛైర్మన్‌ లేని సమయంలో తాత్కాలికంగా) ఆ కుర్చీలో కూర్చొని పెద్దల సభని నడిపించారు కూడా.

కనుక ఒకప్పుడు జైలుకి వెళ్ళాలంటే భయపడే రాజకీయ నాయకులకి ఇప్పుడు జీవితంలో ఒక్కసారైనా జైలులో గడిపి వస్తేనే పదవి, అధికారం లాభిస్తాయనే సెంటిమెంట్ ఏర్పడింది.

మిథున్ రెడ్డి జైలుకి వెళ్ళాలనుకోలేదు. కానీ ఆయనకు అదృష్టం అలా కలిసి వచ్చింది! ఇప్పుడు నాలుగు రోజులకు బెయిల్‌ కూడా లభించింది.

ఇది చాలా గొప్ప విషయంగానే వైసీపీ భావించింది. అందుకే సోషల్ మీడియాలో మిథున్ రెడ్డి ఫోటో వేసి “నాలుగు రోజులు బెయిల్‌ లభించిందని” సందేశం పెట్టింది. పనిలో పనిగా సాక్షిలో కూడా వేసుకుంది.

జైల్లో పెట్టడం అంటే ఆ వ్యక్తి పరువు, ప్రతిష్టలు, గౌరవం అన్నీ మంట గలపడమే అని జగన్మోహన్ రెడ్డి స్వయంగా అన్నారు.

కనుక అవన్నీ మంట గలిసిపోయిన వ్యక్తి నాలుగు రోజుల బెయిల్‌పై బయటకు వస్తుంటే, అదీ జైలు నుంచి ఢిల్లీకి ఉప రాష్ట్రపతి ఎన్నుకోవడానికి వెళుతుంటే అందుకు సిగ్గుపడాలి కదా?

కానీ వైసీపీ ఇది చాలా గొప్ప విషయంగా భావిస్తోంది. కనుక గొప్పగా చెప్పుకుంది. ఇలాంటి గొప్పవాళ్ళు.. గొప్ప విషయాలు వైసీపీలో చాలానే ఉన్నాయి కూడా.

ADVERTISEMENT
Latest Stories