రాష్ట్రంలో ప్రభుత్వం మారిన వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో మాజీ ముఖ్యమంత్రి, మాజీ మంత్రుల ఫోటోలు తీసేసి, ప్రస్తుత ముఖ్యమంత్రి, మంత్రుల ఫోటోలు పెడుతుంటారు. ఈ సాంప్రదాయం చాలా ఏళ్ళ బట్టి సాగుతోంది.
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సిఎం చంద్రబాబు నాయుడు, డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్, సంబందిత శాఖల మంత్రుల ఫోటోలు పెట్టారు.
ఈ జూన్ 12తో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతుంది. కానీ నేటికీ కొందరు అధికారుల కార్యాలయాలలో మాజీ సిఎం జగన్ ఫోటోలు ఉంచుకున్నారు.
కూటమి ఎమ్మెల్యేలో, ఆ పార్టీ నేతలో ఏదో పని మీద వారి కార్యాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ జగన్ ఫోటోని చూసి ఆగ్రహం వ్యక్తం చేస్తే, అప్పుడు తీస్తున్నారు. లేకుంటే జగన్ ఫోటోలే ఉంచుకుంటున్నారు.
ఈ అంశంపై మడకశిర ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు స్పందిస్తూ “మీలో ఎవరికైనా జగన్ మీద అంత భక్తి, గౌరవం, ప్రేమ, అభిమానం ఉంటే ఆయన ఫోటోలను తీసుకువెళ్ళి మీ ఇంట్లో పెట్టుకోండి.. పూజ గదిలో పెట్టుకొని పూజించుకోండి కానీ ప్రభుత్వ కార్యాలయాలలో ఉంచితే మాత్రం మర్యాదగా ఉండదు.
జగన్‌కి విధేయంగా ఉండదలచుకుంటే, మీ ఉద్యోగాలకు రాజీనామా చేసి వెళ్ళి వైసీపీలో చేరి జగన్ భజన చేసుకోండి మాకేమీ అభ్యంతరం లేదు. కానీ ప్రభుత్వం నుంచి జీతాలు తీసుకుంటూ జగన్ భజన చేస్తామంటే కుదరదు. ఇకపై ఏ అధికారి కార్యాలయంలోనైనా జగన్ ఫోటో కనిపిస్తే కఠిన చర్యలు తీసుకుంటాము,” అని హెచ్చరించారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలల వరకు పౌర సరఫరాల శాఖ నుంచి రేషన్ బియ్యం కాకినాడ పోర్టు ద్వారా విదేశాలకు ఎగుమతి అయ్యిందంటేనే ప్రభుత్వం సిగ్గుతో తల దించుకోవాలి.
గోదాముల నుంచి ఓ రేషన్ బియ్యం మాయం చేసిన కేసులో చిక్కుకున్న మాజీ మంత్రి పేర్ని నాని, ప్రెస్‌మీట్లు పెట్టి సిఎం చంద్రబాబు నాయుడుపై విమర్శలు గుప్పిస్తుంటే, టీడీపీ నేతలు, మంత్రులు స్పందించకపోవడం సిగ్గుచేటు.
చంద్రబాబు నాయుడుని, ఆయన సతీమణి భువనేశ్వరి గురించి నోటికి వచ్చినట్లు మాట్లాడిన కొడాలి నాని విదేశాలకి పారిపోయేందుకు సిద్దంగా ఉన్నారని మీడియాలో వార్తలు వస్తే గానీ లుకవుట్ నోటీస్ జారీ చేయక పోవడాన్ని ఏమనుకోవాలి?
చివరికి ప్రభుత్వాధికారుల కార్యాలయాలలో జగన్ ఫోటోలు తీసేయమని ఈవిదంగా వార్నింగ్ ఈయాల్సి రావడం అవమానం కాదా?
ఇదే జగన్ ముఖ్యమంత్రిగా ఉంటే ఏ అధికారైనా తన కార్యాలయంలో చంద్రబాబు నాయుడు ఫోటో పెట్టుకునే ధైర్యం చేయగలరా?చేసి బ్రతికి బట్ట కట్టగలరా?
కానీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఏడాది తర్వాత కూడా కూడా ఇంకా అధికారుల కార్యాలయాలలో జగన్ ఫోటోలు ఉన్నాయంటే అది వారి తప్పా కానే కాదు.. కూటమి ప్రభుత్వం చాతగానితనమే! అని పార్టీ శ్రేయోభిలాషులే అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వ కార్యాలయాల్లో జగన్ ఫోటో ఉంటే నడిరోడ్డుపై పడేసి పగలగొడతాం: మడకశిర ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు
మీ సొంత కార్యాలయాల్లో మీకు ఇష్టం వచ్చిన ఫోటో పెట్టుకోండి
అంతేకానీ ప్రభుత్వ కార్యాలయాల్లో జగన్ ఫోటో పెడతాం అంటే మాత్రం ఊరుకోం
– ఎమ్మెస్ రాజు pic.twitter.com/lVYFxBrAFK
— BIG TV Breaking News (@bigtvtelugu) May 25, 2025




