
తాను జడ్జిగా వ్యవహరిస్తున్న ‘జబర్దస్త్’ కార్యక్రమంలో బూతు డైలాగులు, ద్వంద్వ అర్థాలు వచ్చే మాటలు ఉన్నాయని, అలాంటి షోలలో ఒక ప్రజాప్రతినిధిగా ఎందుకు ఉంటున్నారని రోజాపై వస్తున్న విమర్శలపై తాజాగా బదులిచ్చారు. “నేను అడుగుతున్నాను. అది ఈటీవీలో ప్రసారం అవుతోంది. ఈ రోజు నన్ను మాట్లాడిన మాటలు రామోజీరావును ఎందుకు అడగట్లేదు. ఆ తెలుగుదేశం వాళ్లు గానీ, మీరు గానీ… నాకు తెలియడం లేదు. మేము అక్కడ కేవలం జడ్జస్ గా కూర్చున్నాం… అంతే…” అంటూ సర్దిచెప్పుకునే ప్రయత్నం చేసారు.
“అక్కడ జరిగిన దానికి మేము నవ్వినా, నవ్వకపోయినా… నవ్వే షాట్ వారు వేసుకుంటారన్న సంగతి మీకు తెలుసు. ఎంటర్టెయిన్మెంట్ షో అంటే మీకు తెలుసు. అదేమీ రియాల్టీ షో కాదు. మరి అలాంటి ఓ కామెడీ షోలో, అందరినీ వదిలేసి రోజాను టార్గెట్ చేయడమంటే, రోజాను చూసి భయపడుతున్నట్టే. నేనెక్కడా బూతు డైలాగులు చెప్పలేదు. నేనేమీ ఎడిటింగ్ చేయను. అందుకు సెన్సార్ బోర్డు ఉంది. నాపై విమర్శలు కడుపుమంటతో మాట్లాడుతున్నవే. ప్రభుత్వం మీ చేతుల్లో ఉన్నప్పుడు సెన్సార్ బోర్డుకు చెప్పకుండా మీరేం చేస్తున్నారు?” అంటూ దీనిని ప్రస్తావిస్తూ కూడా చంద్రబాబు ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు.
ఈ రోజు ఇటువంటివి ఎన్నో షోలు ఉన్నాయని, వాటి గురించి ఎవరూ మాట్లాడటం లేదని, కేవలం తనపై మాత్రమే విమర్శలు చేయడం కోడిగుడ్డుపై ఈకలు పీకడం వంటిదేనని, తననెవరూ ఏమీ చేయలేరని దుయ్యబట్టారు. అది విజయవంతమై షో కాబట్టే, నాలుగేళ్ల నుంచి నడుస్తోందని, దానికి పోటీగా వచ్చిన ఎన్నో షోలు పది రోజులకే ఆగిపోయాయని అన్నారు. ఎక్కడో ఏదో మాట్లాడారంటూ, బూతద్ధంలో వెతికి దాన్ని రోజాకు అంటగట్టాలని చూస్తుంటే, తానేం చెప్పలేనని అన్నారు.
ఒక తప్పయిన షో అయితే, రామోజీరావు దాన్ని ఎంకరేజ్ చేయరని, ఈటీవీకి ఉన్న బ్రాండ్ అటువంటిదని, అదే షో తప్పయితే, శ్యాంప్రసాద్ రెడ్డి అన్ని కోట్లు ఖర్చు పెట్టి తీయరని స్పష్టం చేశారు… జడ్జీలుగా ఉన్న మేమేం చిన్నపిల్లలం, రోడ్లపై నుంచి వచ్చిన వాళ్లం కాదని, ఓ స్టేటస్ ఉన్న వాళ్లమేనని అన్నారు. ఒక జడ్జిగా ఉండడంపై రోజా సమర్ధించుకునే వ్యాఖ్యలు సర్వసాధారణమే గానీ, దీనిని ఎందుకు ఆపడం లేదంటూ ‘జబర్దస్త్’కు, చంద్రబాబు ప్రభుత్వానికి లింక్ పెట్టడం అనేది ‘బోడిగుండుకు, మోకాలుకు లింక్ పెట్టడం’ వంటిదేగా! సందర్భం ఏదైనా చివరికి అధికారంలో ఉన్న ప్రభుత్వమే కారణం అని చెప్పడం రోజా విజ్ఞతకే వదిలేయాలేమో!



