అసెంబ్లీలో రోజా ప్రదర్శించిన హావభావాలు మరియు టిడిపి ఎమ్మెల్యే అనితను ఉద్దేశించి చేసిన అసభ్యకరమైన పదజాలానికి గానూ ఒక ఏడాది పాటు సస్పెన్షన్ కు గురైన విషయం తెలిసిందే. దీనిపై వైసీపీ ఎంత రాద్ధాంతం చేసినా పెద్దగా ప్రయోజనం లేకపోగా, చివరికి రోజా ‘క్షమాపణలు’ కోరక తప్పలేదు. అయితే రోజాపై ఉన్న సస్పెన్షన్ ను ఎత్తివేసే అధికారం గానీ లేక దానిని పొడిగించే అధికారం గానీ ప్రివిలేజ్ కమిటీకే ఉంటుంది.
తాజా రాజకీయ వర్గాల సమాచారం మేరకు… మరో ఏడాది పాటు రోజాపై సస్పెన్షన్ కొనసాగించాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. ప్రివిలేజ్ కమిటీకి టిడిపి ఎమ్మెల్యే అనిత ఇచ్చిన ఫిర్యాదును, రోజా ఇచ్చిన సమాధానాన్ని సరిపోల్చుకున్న ప్రివిలేజ్ కమిటీ… రోజా జవాబుతో సంతృప్తి చెందకపోవడం వలన, అసెంబ్లీ సస్పెన్షన్ ను మరో ఏడాది పాటు కొనసాగించాలని సిఫారసు చేసింది. దీంతో కొత్త అసెంబ్లీలో ఆసీనులు కావాలనుకున్న రోజా ఆశలు అడియాశలు అయ్యే సంకేతాలు స్పష్టంగా కనపడుతున్నాయి.
అయితే ఇటీవల మహిళా పార్లమెంట్ సదస్సు సందర్భంగా రోజా సృష్టించిన అలజడి కూడా ఓ కారణమై ఉండవచ్చన్నది పొలిటికల్ వర్గాల టాక్. జాతీయ, అంతర్జాతీయ మహిళామణులు పాల్గొన్న ఈ సదస్సులో రచ్చరచ్చ చేస్తానని చెప్పి మరీ సదస్సుకు బయలుదేరడం, దానిని ప్రభుత్వం అడ్డుకోవడం, రోజా సెల్ఫీ వీడియోలు తీసి జగన్ కు పంపించడం, జగన్ వాటిని మీడియా ద్వారా సర్క్యూలేట్ చేయడం… ఇలాంటి పరిణామాలన్నీ రోజా కేంద్రం జరగడంతో… ఇంత జరిగినా రోజాకు బుద్ధి రాలేదని ప్రభుత్వం ఒకింత గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది.



