కాకినాడలో దళిత యువకుడు సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితుడిగా ఉన్న వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబుని, ప్రతిపక్షాల ఒత్తిళ్ళు భరించలేక పార్టీ నుంచి బహిష్కరించినప్పటికీ, ఎమ్మెల్సీగా అనర్హత వేటు వేయలేదు. దానిని బట్టి పార్టీ పెద్దలకి అతని పట్ల ఎటువంటి అభిప్రాయం ఉందో అర్దం చేసుకోవచ్చు. అతను చేసింది చాలా తీవ్రమైన నేరం కావడంతో కాకినాడ ఎస్సీ, ఎస్టీ కోర్టు రెండుసార్లు బెయిల్ పిటిషన్లను తిరస్కరించింది. చట్ట ప్రకారం ఒకవేళ అరెస్ట్ అయిన 90 రోజులలో పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేయకపోయినా, ఒకవేళ దానిని న్యాయమూర్తి ఏ కారణంతోనైనా పోలీసులు దాఖలు చేసిన ఛార్జ్ షీట్‌ని తిరస్కరించినా ఆటోమెటిక్‌గా బెయిల్ మంజూరవుతుంది.
అతనిని బయటకి రప్పించేందుకు చట్టంలోని ఈ లొసుగులను కూడా వాడుకొనేందుకు పోలీసులు ప్రయత్నించారని, బాధిత కుటుంబం తరపున వాదిస్తున్న ప్రముఖ న్యాయవాది, ఆంధ్రప్రదేశ్ పౌరహక్కుల సంఘం అధ్యక్షుడు ముప్పాళ్ళ సుబ్బారావు ఆరోపించారు.
తాము చాలా ఒత్తిడి చేయడం వలననే పోలీసులు 88వ రోజున ఛార్జ్ షీట్ దాఖలు చేశారని, అదీ… న్యాయమూర్తి తిరస్కరించేందుకు లోపభూయిష్టంగా వేశారని ఆరోపించారు. ఆ కారణం చూపుతూ అనంత బాబు మళ్ళీ మూడోసారి బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా, ముప్పాళ్ళ సుబ్బారావు ఇదే విషయం న్యాయమూర్తి దృష్టికి తీసుకువెళ్ళారు. ఇంత రాజకీయ పలుకుబడి కలిగిన అనంత బాబుకి బెయిల్ ఇస్తే అతను సాక్షులను ప్రభావితం చేసి కేసును తప్పుదోవ పట్టిస్తాడని వాదించారు. సిఎం జగన్మోహన్ రెడ్డి సొంత చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసును ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించి, అనంత బాబుకి బెయిల్ మంజూరు చేస్తే ఈ కేసు కూడా అలాగే మారే ప్రమాదం ఉందని వాదించారు. ఇరు పక్షాలవాదనలు విన్న న్యాయమూర్తి అనంత బాబు బెయిల్ పిటిషన్‌ను తిరస్కరిస్తున్నట్లు ప్రకటించారు.
నిజానికి ఇప్పుడు అనంత బాబుపై హత్యానేరంపై విచారణ జరగవలసి ఉండగా మూడు నెలల తర్వాత కూడా ఇంకా అతని బెయిల్ పిటిషన్‌పైనే విచారణలు జరుగుతున్నాయి. ఈ లెక్కన అనంత బాబు నేర నిరూపణ జరిగేదెప్పుడు? శిక్ష పడేదెప్పుడు?
Watch and subscribe for Exclusive Interviews:



