కాకినాడలో సుబ్రహ్మణ్యం అనే దళిత యువకుడిని వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు హత్య చేసి అతని శవాన్ని డోర్ డెలివరీ చేసిన కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే అతను అధికార పార్టీకి చెందినవాడు కావడంతో పోలీసులు అతనిని అరెస్ట్ చేసేందుకు కూడా జంకారు. కానీ హతుడు కుటుంబ సభ్యులు, ప్రజా సంఘాలు, ముఖ్యంగా ప్రముఖ న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ ఆందోళనలు చేపట్టడంతో హత్య జరిగిన వారం రోజుల తర్వాత పోలీసులు ఎమ్మెల్సీ అనంతబాబును అరెస్ట్ చేశారు.
ఆ తర్వాత కూడా ఈ కేసు నుంచి అతనని ఏదో విదంగా బయటపడేసేందుకే ప్రయత్నిస్తున్నారని జడ శ్రవణ్ కుమార్ ఆరోపించారు. ఓ దళిత యువకుడిని హత్య చేసి జైలుకి వెళ్ళిన అనంతబాబుకి కోర్టులు బెయిల్ మంజూరు చేయడానికి నిరాకరిస్తుంటే, అరెస్ట్ అయిన 90 రోజులలోగా ఛార్జ్ షీట్ దాఖలు చేయకపోయిన, దానిలో సరైన వివరాలు లేకపోయినా బెయిల్ పొందవచ్చు. పోలీసులు ఆవిదంగా కూడా ఎమ్మెల్సీ అనంతబాబుకి బెయిల్ లభించేలా చేసేందుకు చాలా ప్రయత్నించారని జడ శ్రవణ్ కుమార్ ఆరోపించారు.
ఈ కేసును పక్కదారి పట్టించేందుకు అనంతబాబుకు పోలీసులు సహకరిస్తున్నారని కనుక ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని కోరుతూ సుబ్రహ్మణ్యం తల్లితండ్రులు హైకోర్టులో ఓ పిటిషన్ వేశారు. దానిపై నేడు హైకోర్టు విచారణ చేపట్టినప్పుడు వారి తరపున జడ శ్రవణ్ కుమార్ వాదిస్తూ, ఈ కేసులో ప్రాధమిక సాక్ష్యాధారాలను తుడిచివేశారని, సింగిల్ జడ్జ్ ఆదేశించినప్పటికీ పోలీసులు సిసి ఫుటేజీ రికార్డులలో ఉన్నవారు ఎవరో కూడా చూడలేదని వాదించారు.
పోలీసుల తీరు చాలా అనుమాస్పదంగా ఉందని, అధికార పార్టీ కనుసన్నలలో పనిచేస్తున్న వారు ఈ కేసులో నిందితుడికి శిక్షపడేలా చేసే బదులు ఏవిదంగా ఈ కేసు నుంచి బయటపడేయాలా అని ఆలోచిస్తున్నారని వాదించారు. కనుక ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని కోరారు.
అనంతబాబు తరపు న్యాయవాది ఈ కేసును సీబీఐకి అప్పగించాలనే పిటిషన్‌పై అభ్యంతరం తెలుపుతూ దానిని తిరస్కరించాలని విజ్ఞప్తి చేశారు. అయితే హైకోర్టు ఆయన అభ్యర్ధనలనే పట్టించుకోకుండా ఈ కేసు తీర్పుని రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించింది.
అవినాష్ రెడ్డి తదితరులు వివేకా హత్య కేసు విచారణను ప్రభావితం చేస్తునట్లే, ఈ కేసును అనంతబాబు ప్రభావితం చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. కనుక ఈ కేసు దర్యాప్తును కూడా సీబీఐకే అప్పగించినా ఆశ్చర్యం లేదు.
అయితే ఇంతకంటే చాలా పెద్ద కేసుగా భావించబడే వివేకానందా రెడ్డి హత్య కేసును సీబీఐకి అప్పగించి, హైదరాబాద్‌కు బదిలీ చేయించుకొన్నా సీబీఐని కట్టడి చేయగలుగుతున్నప్పుడు ఈ కేసులో కట్టడి చేయడం ఓ లెక్కా?



