
మాజీ సిఎం కేసీఆర్ తెలంగాణ రాజకీయాలను కంటి సైగతో శాశిస్తున్నరోజుల్లోనే చింతపండు నవీన్ అలియాస్ తీన్‌మార్ మల్లన్న ఏ రాజకీయ పార్టీలో లేనప్పటికీ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా తీవ్రస్థాయిలో ఎదిరించారు. పోరాడారు. తన పోరాటాలతో తెలంగాణ ప్రజలని ఆకర్షించగలిగారు కానీ రాజకీయంగా రాణించలేకపోయారు. అప్పుడు పీసీసీ అధ్యక్షుడుగా ఉన్న రేవంత్ రెడ్డి , సీనియర్ కాంగ్రెస్ నేతలు ఆయనకు స్నేహహస్తం అందించి పార్టీలో చేర్చుకున్నారు. తర్వాత ఎమ్మెల్సీ పదవి కూడా ఇచ్చారు.
కానీ తీన్‌మార్ మల్లన్న సిఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీపైనే కత్తులు దూసి పార్టీ నుంచి బహిష్కరించబడ్డారు. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించిన కులగణన అంతా ఓ భూటకమని, బీసీలకు అన్యాయం చేస్తున్న రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి ఇదే మొదటిసారి ఆఖరిసారి అవుతుందంటూ తీన్‌మార్ మల్లన్న విరుచుకుపడ్డారు.
Also Read – నాగబాబు వ్యాఖ్యలు…వర్మకు కౌంటరా.?
సీనియర్ కాంగ్రెస్ నేతలు తీన్‌మార్ మల్లన్నకు నచ్చజెప్పేందుకు చాలా ప్రయత్నించారు. కానీ సిఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు, ఆరోపణలు చేస్తూ కాంగ్రెస్ పార్టీకి కంట్లో నలుసులా చాలా ఇబ్బందికరంగా మారడంతో గత నెల 5న కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ తీన్‌మార్ మల్లన్నకి షోకాజ్ నోటీస్ జారీ చేసీ వారం రోజులలోగా సంజాయిషీ ఇవ్వాలని కోరింది. కానీ ఆయన పార్టీని వీడే ఉద్దేశ్యంతో ఉన్నట్లున్నారు. అందుకే షోకాజ్ నోటీస్ పట్టించుకోకుండా ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు.
కనుక పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించి పార్టీకి నష్టం కలిగేవిదంగా వ్యవహరిస్తునందుకు సస్పెండ్ చేస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రకటించింది. ఏదో ఓ రాజకీయ పార్టీలో ఉంటేనే చాలా మంది నేతలు గుర్తింపుకు నోచుకోక రాజకీయంగా ఎదుగూబొదుగూ లేకుండా జీవితం గడిపేస్తుంటారు. అలాంటప్పుడు తీన్‌మార్ మల్లన్నకి ఎమ్మెల్సీ పదవి, దాంతో మరింత గుర్తింపు లభించినప్పుడు సద్వినియోగం చేసుకొని ఇంకా పైకి ఎదిగేందుకు కృషి చేయాలి. కానీ కూర్చున్న కొమ్మని నరుక్కున్నట్లు ప్రవర్తించి తన రాజకీయ జీవితాన్ని తానే దెబ్బతీసుకున్నారు.