కేసీఆర్‌ అవినీతి ఢిల్లీ వరకు వ్యాపించింది!

Modi Comments On KCR Corruptionప్రధాని నరేంద్రమోడీ శనివారం వరంగల్‌ జిల్లాలో పర్యటించి రూ.6,109 కోట్లు విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. మరో 4-5 నెలల్లో శాసనసభ ఎన్నికలు జరుగబోతున్నాయి. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి పైసా విదిలించడం లేదంటూ కేసీఆర్‌ ప్రభుత్వం గత నాలుగేళ్ళుగా దుష్ప్రచారం చేస్తూనే ఉంది. వాటన్నిటికీ మోడీ హన్మకొండలో నిర్వహించిన విజయసంకల్ప సభలో సమాధానం చెప్పారు.

ADVERTISEMENT

తెలంగాణలో జరుగుతున్న ప్రతీ అభివృద్ధి పనులలో, అనేక సంక్షేమ పధకాలకు కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు నిధులు అందిస్తోందని చెప్పారు. అలాగే తెలంగాణతో సహా దేశవ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం నేరుగా నిధులు అందజేస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా మోడీ ప్రజలకు గుర్తుచేశారు.

ఇప్పుడు తెలంగాణలో రూ.6,109 కోట్లు విలువైన అభివృద్ధిపనులకు కేంద్ర ప్రభుత్వం నిధులు అందజేస్తుందని స్పష్టం చేశారు. ఒకప్పుడు పెద్ద నగరాలు, పట్టణాలలో మాత్రమే అభివృద్ధి పనులు జరిగేవని, కానీ కేంద్రంలో తమ ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటి నుంచి దేశంలో మారుమూల గ్రామాలకు సైతం అభివృద్ధి విస్తరింపజేస్తోందని, సంక్షేమ పధకాలు అందజేస్తోందని ప్రధాని నరేంద్రమోడీ చెప్పారు.

తెలంగాణలో ఈ 9 ఏళ్ళలో కేసీఆర్‌ కుటుంబం రాష్ట్రాన్ని దోచుకొని ధనవంతులయ్యారని, కేసీఆర్‌ అవినీతి లిక్కర్ స్కామ్‌తో ఢిల్లీ వరకు పాకిందని మోడీ విమర్శించారు. తెలంగాణలో ఏ ప్రాజెక్టులో చూసిన కేసీఆర్‌ అవినీతి కనిపిస్తుందని అన్నారు. టిఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంతో రాష్ట్రంలో లక్షలాదిమంది నిరుద్యోగుల జీవితాలతో కేసీఆర్‌ ఆటలాడుతున్నారని ప్రధాని మోడీ ఆరోపించారు.

ప్రతీ ఇంటికీ ఉద్యోగం, యువతకు నిరుద్యోగభృతి, రైతులకు పంట రుణాల మాఫీ, పేదలందరికీ డబుల్ బెడ్ రూమ్‌ ఇళ్ళు ఇస్తానని కేసీఆర్‌ హామీలు ఇచ్చి వాటిని అమలుచేయకుండా తన కోసం వేలకోట్లు ఖర్చు చేస్తూ విలాసవంతమైన భవనాలు నిర్మించుకొంటున్నారని ప్రధాని నరేంద్రమోడీ ఆరోపించారు.

కేసీఆర్‌ ప్రభుత్వాన్ని గద్దె దించి బిజెపిని అధికారంలోకి తెచ్చుకొంటే తెలంగాణ సంపద ప్రజలకు దక్కుతుందని, తెలంగాణ రాష్ట్రం మరింత వేగంగా అభివృద్ధి చెందుతుందని మోడీ అన్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా దేశాన్ని భ్రష్టు పట్టించేసిందని, కనుక బిఆర్ఎస్‌, కాంగ్రెస్ రెండు పార్టీలను పూర్తిగా తుడిచిపెట్టేస్తామని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు.

ప్రధాని నరేంద్రమోడీ పర్యటనకు రాక ముందు నుంచే బిఆర్ఎస్‌ నేతలు కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్రమోడీలపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇప్పుడు ఆయన ఢిల్లీకి తిరుగు ప్రయాణం కాగానే వారు తెలంగాణ భవన్‌లో ప్రెస్‌మీట్‌ పెట్టి ఎదురుదాడి చేయడం ఖాయమే. ప్రధాని మోడీ తెలంగాణ గడ్డపై నిలబడి కేసీఆర్‌ ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించారు కనుక ఇక ఎన్నికల వరకు రెండు పార్టీల మద్య హోరాహోరీగా ఈ యుద్ధం కొనసాగుతూనే ఉంటుంది.

ADVERTISEMENT
Latest Stories