ఢిల్లీలో జరిగిన ఓ లోకల్ టీ20 టోర్నీలో కేవలం 70 బంతుల్లోనే 300 పరుగులు సాధించిన 21 సంవత్సరాల చిచ్చరపిడుగు మోహిత్ అహ్లావత్ ను బంపర్ ఆఫర్ వరించింది. త్వరలో ప్రారంభం కానున్న ఐపీఎల్ సీజన్ లో ఆటగాళ్ల కోసం నిర్వహించిన ట్రయల్స్ లో పాల్గొనేందుకు రావాల్సిందిగా ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు ఆహ్వానం పంపింది. దీంతో మోహిత్ జాతకం మారిపోనుందని కోచ్ సంజయ్ భరద్వాజ్ అభిప్రాయపడ్డారు.
సంజయ్ గతంలో గౌతమ్ గంభీర్, ఉన్ముక్త్ చాంద్ వంటి ఆటగాళ్లకు కోచింగ్ ఇచ్చారు. సాధారణ రైతు కుమారుడిగా మోహిత్ క్రికెట్ పట్ల అత్యంత ఆసక్తి చూపేవాడని మోహిత్ లో అద్భుతమైన టెక్నిక్ దాగుందని, ఢిల్లీ డేర్ డెవిల్స్ ట్రయల్స్ లో ఆకట్టుకుంటాడని కోచ్ సంజయ్ భరద్వాజ్ ఆశాభావం వ్యక్తం చేశారు. మోహిత్ కున్న మరొక ప్లస్ పాయింట్ వికెట్ కీపింగ్ అని, అందులో కూడా అద్భుతంగా రాణిస్తాడని అన్నారు.
ఐపీఎల్ ఎంతోమంది క్రీడాకారుల జీవితాలను మార్చివేసిన సంగతి తెలిసిందే. ఒకప్పుడు అంతర్జాతీయ క్రికెట్ ఆడి, మరుగున పడిపోయిన వారికి పునర్జన్మ ఇచ్చిన ఐపీఎల్, ఎందరో యువ క్రీడాకారుల జాతకాలను కూడా మార్చివేసింది. ఇంగ్లాండ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ లో కరుణ నాయర్ ట్రిపుల్ సెంచరీ కొట్టినా, వన్డేలలో కేదార్ జాదవ్ అద్భుతమైన సెంచరీ కొట్టినా, అది ఐపీఎల్ మహిమే. దీంతో మోహిత్ జీవితం కూడా మార్చేస్తుందన్న నమ్మకం వ్యక్తమవుతోంది.



