ఆంధ్రప్రదేశ్ లో గత రెండున్నర్ర సంవత్సరాలుగా జరుగుతోన్న రాజకీయం త్వరలో వెండితెరపై ప్రత్యక్షం అవబోతోందా? అంటే ఇప్పటికప్పుడు కాకపోయినా 2024 నాటికి ఓ బ్రహ్మాండమైన సినిమా అయితే సిద్ధం కాబోతుందన్న సంకేతాలను ప్రస్తుత వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో స్పష్టత ఇచ్చారు.
తనకు సినీ పరిశ్రమతో సత్సంబంధాలు ఉన్న మాట నిజమేనని, అలాగే ఇద్దరు, ముగ్గురు టాప్ దర్శకులతో చర్చలు జరిపిన మాట కూడా వాస్తవమేనని, వాళ్ళు ఓ లైన్ తనకు చెప్పారని, అయితే తన దగ్గర అంతకంటే బ్రహ్మాండమైన కధ ఉందని చెప్పానని, ప్రస్తుతం వైసీపీలో ఉన్నాను గనుక, ఇది తేలిన తర్వాత సినిమా గురించి ఆలోచనలు చేయొచ్చని ఆర్ఆర్ఆర్ ఈ సందర్భంగా తెలిపారు.
ఈ సినిమా కధ ప్రస్తుత రాజకీయాలపై ఉంటుందని, అందులో తనను కొట్టిన ఎపిసోడ్ కూడా ఉంటుందని కాస్త చిరుదరహాసం ప్రదర్శిస్తూనే చెప్పారు. అయితే ఎవరితో తీస్తాను, ఎప్పుడు తీస్తాను అనేది ఇప్పుడే చెప్పలేదు గానీ, 2024 ఎన్నికల నాటికి ఓ ప్రచార అస్త్రంగా ఈ సినిమా సిద్ధం కావచ్చని షో నిర్వాహకుడు చేసిన వ్యాఖ్యలను ఆర్ఆర్ఆర్ తోసిపుచ్చలేదు.
ఈ సందర్భంగా రఘురామకృష్ణంరాజు ఓ విషయాన్ని అయితే బల్లగుద్ది మరీ చెప్పారు. 2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో తాను అత్యంత కీలక వ్యక్తిగా మారతానని, ఇందులో అయితే ఏ మాత్రం సందేహం లేదని నొక్కి వక్కాణించారు. ఆర్ఆర్ఆర్ వ్యాఖ్యలు చూస్తుంటే… ప్రస్తుతం స్తబ్దుగా ఉన్న రాజకీయాల ముఖచిత్రాల తెరవెనుక భారీ వర్కే జరుగుతోందన్న విషయమైతే స్పష్టమవుతోంది.