హత్యలు, అత్యాచారాలు: ఎవరు ఎవరికి నేర్పారు?

Karimnagar crime case highlighting debate on movie violence influencing real-life actions

కోడి ముందా గుడ్డు ముందా? అనే ప్రశ్న అడిగితే ఎవరికో రోషం రావచ్చు. కానీ ఇది వారిని ఉద్దేశించి అడిగినదని మనవి. కనుక ఎవరూ భుజాలు తడుముకోనక్కరలేదు.

సమాజంలో, ప్రభుత్వంలో అవినీతి, అరాచకాలు, ఆకృత్యాలను చూసి సినిమాలు తీస్తున్నారా? లేదా సినిమాలను చూసి మనుషులు ఈ అవలక్షణాలు ఒంట బట్టించుకుంటున్నారా? అనే సందేహం కలుగుతుంది. కనుక కోడి-గుడ్డు ప్రస్తావన చేయక తప్పలేదు.

ADVERTISEMENT

ఈ సందేహానికి కారణం… కరీంనగర్‌లో జరిగిన ఓ హత్యే! ఇద్దరు అన్నదమ్ములు. పేర్లు అనవసరం. తమ్ముడు వయసు 30. అన్నకి 37 ఏళ్ళు. తమ్ముడికి ఒకటిన్నర కోట్లు అప్పులున్నాయి. అన్నకి మతిస్థిమితం లేదు.

కనుక అప్పులు తీర్చుకుని చేతిలో కాస్త డబ్బు మిగుల్చుకోవడానికి అన్నకి భీమా చేయించి చంపేశాడు. ఆ హత్యని ప్రమాదంగా చిత్రీకరించి భీమా క్లెయిమ్ చేశాడు. భీమా కంపెనీకి అనుమానం వచ్చి విచారణ జరిపిస్తే ఈ స్టోరీ బయటపడింది. పోలీసులు తమ్ముడిని లోపలేశారు.

ఇలాంటి ఘటనలు చాలా సినిమాల్లో చూస్తూనే ఉన్నాము. కనుక వాటిని చూసి తమ్ముడికి ఈ ఐడియా వచ్చిందా? లేదా సమాజంలో జరుగుతున్న ఇలాంటి ఘటనలు చూసి సినిమాలు తీస్తున్నారా? అనే ప్రశ్న కోడి ముందా గుడ్డు ముందా? అన్నట్టే ఉంది.

కానీ సినిమాలో క్రూరత్వం హద్దులు దాటి మరింత పాశవికంగా మారుతోంది. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఆయుధాలతో హీరో-విలన్లు నరికేసుకుంటూ రక్తం ఏరులై పారిస్తున్నారు.

ఇప్పుడు తుపాకితో కాల్చి చంపితే లేదా కత్తితో పొట్టలో పొడిచి చంపితే ఎవరూ సంతృప్తి చెందడం లేదు. మనిషిని మనిషి ఎన్ని రకాలుగా ఎంత దారుణంగా హింసించవచ్చో… చంపవచ్చో సినిమాలలో చూపిస్తున్నారు. వెబ్‌ సిరీస్‌లో ఇది మరింత విపరీతంగా ఉంది.

ఇది మనుషులలోని రాక్షసుడిని తృప్తి పరిచేందుకే! మనుషులలో గుప్తంగా ఉండే పైశాచిక ఆనందాన్ని రగిలించేందుకే… అని వేరే చెప్పక్కరలేదు.

బ్లూ ఫిలిమ్స్ చూస్తే ప్రజలు తద్వారా సమాజం చెడిపోతుందని కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. మరి సినిమాల్లో ఇటువంటి పాశవిక హత్యలు, రక్తపాతం చూస్తుంటే ప్రజలపై ఆ ప్రభావం పడకుండా ఉంటుందా? మరి ఎందుకు నిషేదించరు? సెన్సార్ బోర్డ్ ఏమి చేస్తోంది? కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? అని అడిగితే రాజకీయమవుతుంది.

కానీ సమాజంలో జరుగుతున్న ఇటువంటి ఘటనలు మానవ సంబంధాలు, ముఖ్యంగా కుటుంబంలో సంబంధాలు ఇంతగా దిగజారిపోయాయా? అని బాధ కలుగుతుంది.

సమాజంలో ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నప్పుడు ఎవరైనా హాయిగా పడుకోగలరా?ఎందుకంటే భార్యభర్తలు, తల్లిదండ్రులు, కొడుకులు, కూతుళ్ళు ఎవరు ఎవరినైనా చంపేసే ప్రమాదం పొంచి ఉంది కదా?

ADVERTISEMENT
Latest Stories