టీమిండియా ఫాస్ట్ బౌలర్ షమీపై సతీమణి తీవ్ర ఆరోపణలు చేస్తున్న వైనం తెలిసిందే. రోజుకో కొత్త విషయాన్ని బయట పెడుతూ షమీని ఇరకాటంలో పెడుతున్నా… షమీ ఇప్పటివరకు మీడియా ముందుకు రాలేదు. ఈ ఆరోపణలతో బీసీసీఐ కూడా షమీ కాంట్రాక్టును తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ స్థాయిలో ఆరోపణలు ఎదుర్కొంటోన్న షమీకి ఇండియన్ దిగ్గజాల నుండి మద్దతు లభించడం చెప్పుకోదగ్గ విషయం.
నాలుగు రోజుల క్రితం కపిల్ దేవ్ తన మద్దతు తెలుపుతూ… ‘షమీ చాలా మంచి వాడని, ప్రస్తుతం వస్తోన్న ఆరోపణలను చేసేటటువంటి వ్యక్తి కాదని’ అభిప్రాయపడ్డారు. ఇక తాజాగా మహేంద్ర సింగ్ ధోని కూడా షమీకి అండగా నిలవడం చెప్పుకోదగ్గ విషయం. వివాదాలకు దూరంగా ఉండే ధోని అంతటి వ్యక్తి, ఇంత రచ్చపై కామెంట్ చేయడం, అది కూడా షమీకి అనుకూలం కావడంతో, మ్యాటర్ హైలైట్ అయ్యింది.
ఈ ఉదంతం పూర్తిగా షమీ వ్యక్తిగతమైన అంశమని పేర్కొన్న ధోని, తన భార్యకు, దేశానికి షమీ ద్రోహం చేయడని భావిస్తున్నానని అన్నారు. దీనిపై ఇతరులు కామెంట్ చేయడం సరికాదని, బీసీసీఐ కాంట్రాక్టు రద్దు చేయలేదని, తాత్కాలికంగా మాత్రమే నిలిపివేసిందని, షమీని న్యాయస్థానం ఇంకా దోషిగా డిక్లేర్ చేయలేదని గుర్తు చేస్తూ… అందరినీ కాస్త సంయమనం పాటించమని పరోక్షంగా కోరాడు ఈ లివింగ్ లెజెండ్.



