ఏపీ ఎన్నికలలో ఓడిపోయి జగన్, ఆయన మంత్రులు నవ్వులపాలైతే, రాంగోపాల్ వర్మ, పోసాని కృష్ణ మురలి, ముద్రగడ పద్మనాభం వంటివారు జగన్ కోసం నోటికి వచ్చిన్నట్లు మాట్లాడి తమ పరువు తామే తీసుకుని నవ్వులపాలయ్యారు.
పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిస్తే తన పేరు ముద్రగడ పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని భీకర శపధం చేశారు. ఆయన శపధం చూసి కాపు సామాజిక వర్గం కూడా ఆగ్రహించిన్నట్లే ఉంది. అందుకే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ 70 వేల ఓట్లకు పైగా మెజార్టీతో ఘన విజయం సాధించారు.
ఆయన ఒక్కరే కాదు… జనసేన పోటీ చేసిన 21 శాసనసభ, 2 ఎంపీ సీట్లను గెలుచుకొని సరికొత్త రికార్డ్ సృష్టించింది.
ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామిగా బహుశః ఉప ముఖ్యమంత్రిగా కీలకపాత్ర పోషించే అవకాశం కూడా ఉంది. మోడీ ప్రభుత్వం మనుగడకు టిడిపి, జనసేనల మద్దతు కీలకం కావడంతో పవన్ కళ్యాణ్ ప్రాధాన్యత ఇంకా పెరుగుతుంది.
ఇంతకాలం జగన్, పోసాని, వర్మ, ముద్రగడ పద్మనాభం వంటివారు పవన్ కళ్యాణ్‌కు శాపాలు పెడితే అవే ఆయనకు దీవెనలుగా మారాయి. ముద్రగడ పద్మనాభం తిట్లు, విమర్శల కారణంగానే పిఠాపురం పవన్ కళ్యాణ్ మెజార్టీ అంతగా పెరిగిందని చెప్పవచ్చు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వారందరికీ అందనంత ఎత్తుకి ఎదిగిపోయారు కూడా. కానీ ఎంత ఎదిగినా ఒదిగి ఉండే వ్యక్తి పవన్ కళ్యాణ్ కావడం కూడా వారందరి అదృష్టమనే అనుకోక తప్పదు. పవన్ కళ్యాణ్ రాజకీయ ఎదుగులను జీర్ణించుకోవడం వారందరికీ కష్టమే. కానీ భరించక తప్పదు.
తనను విమర్శించిన వారిని పవన్ కళ్యాణ్ పట్టించుకోకపోయినా ఆయన అభిమానులు, జనసైనికులు మాత్రం ముద్రగడ పద్మనాభాన్ని విడిచిపెట్టడం లేదు. ఎప్పుడు పేరు మార్చుకుంటారని అడుగుతున్నారు.
ఆయన సమాధానం చెప్పకముందే కొందరు అభిమానులు ఆయన ఫోటో పెట్టి, వెనుక గోడ మీద నూతన నామకరణ మహోత్సవం అని వ్రాసి, ఒకరొకరుగా లైన్లో వస్తూ “అయ్యా ముద్రగడ పద్మనాభ రెడ్డిగారు… నమస్కారం మీరు పేరు మార్చుకుంటామని చెప్పారు కదా? మార్చుకున్నారో లేదో మాకు తెలీదు కనుక మేమే మార్చేశాము…” అంటూ వ్యంగ్యంగా పలకరిస్తున్న వీడియో సోషల్ మీడియాలో పెట్టారు. అది వైరల్ అయ్యింది.
ముద్రగడ పద్మనాభం ఆడిన మాట తప్పేవారు కారు కనుక నేడో రేపో అందరినీ పిలిచి తన నామకరణ మహోత్సవం జరిపించేసుకుంటే బాగుంటుంది. లేకుంటే చీటికి మాటికి ఇలా ఎవరో ఒకరు గుర్తుచేసి అడుగుతూనే ఉంటారు.




