ముద్రగడ పద్మనాభంని చూస్తున్నవారంతా “పాపం ఎలా ఉండే మనిషి నెల రోజుల్లోనే ఎలా అయిపోయారో?” అని బాధపడుతున్నారంటే అతిశయోక్తి కాదు. అలాగని ఆయనకు ఏదో ప్రాణాంతకమైన వ్యాధి సోకలేదు. ఎటువంటి అనారోగ్యం లేదు.
మరేమైంది ఆయనకు? అంటే చంద్రబాబు భాషలో ‘జగన్ వైరస్’ సోకింది. అప్పటి నుంచే ఆయన మాట తీరు, ఆలోచన విధానం పూర్తిగా మారిపోయింది. ఎంతగా అంటే కన్న కూతురు కూడా తప్పు పట్టేంత! ‘జగన్ వైరస్’తో ‘ముద్రగడ ఫైల్స్’ అన్నీ కరప్ట్ అయిపోయాయి. వాటిని మళ్ళీ ఫార్మాట్ చేసి సరిచేయడం కూడా సాధ్యం కాకపోవచ్చు.
ఇంతకీ విషయం ఏమిటంటే, జగన్ ఆయనను వన్ మ్యాన్ ఆర్మీగా నియమించుకొని, ‘మిషన్ పవన్ డిఫీట్’ అనే ఒకే ఒక్క బాధ్యత అప్పగించారు. కానీ ఆయన పిఠాపురంలో అడుగుపెట్టకుండా ఇంట్లోనే కూర్చొని ప్రజలకు లేఖలు వ్రాసి, పవన్ కళ్యాణ్‌ను ఓడించేయాలనుకుంటున్నారు. లేకుంటే ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మారిపోయేందుకు సిద్దంగా ఉన్నానని ఆయనే చెప్పుకున్నారు.
తాజాగా ముద్రగడ పిఠాపురం ప్రజలకు మరో లేఖ వ్రాశారు. అయితే అది చమత్కారంగా ఉందే గానీ సరుకు లేనే లేదు.
ఇదివరకు గాజు గ్లాసులు వాడే రోజుల్లో అవి కింద పడి పగిలిపోయి కాళ్లలో గుచ్చుకునేవి కనుక ‘గాజు గ్లాసు’ల స్థానంలో స్టీలు గ్లాసులు వచ్చాయని, ఒకప్పుడు అందరూ సైకిళ్ళు వాడేవారని కానీ అవి తుప్పుపట్టిపోతుండటంతో వాటిని పక్కన పడేసి ప్రజలు మోటార్ సైకిల్స్, కార్లు వాడుతున్నారని ముద్రగడ తెలియజేశారు.
కానీ నాటికీ, నేటికీ ఎప్పటికీ అందరి ఇళ్ళలో సీలింగ్ ఫ్యాన్ల చల్లటి గాలితో ప్రజలు సేదతీరుతూనే ఉన్నారని, ఆ ఫ్యాన్ గుర్తు జగన్మోహన్ రెడ్డిది కనుక అందరూ ఫ్యాన్ గుర్తుకే ఓట్లు వేసి ఆయనను గెలిపించమని ముద్రగడ పద్మనాభం లేఖ సారాంశం.
కాపుల సంక్షేమం, అభివృద్ధి కోరుకుంటానని చెప్పుకునే ఆయన పవన్ కళ్యాణ్ ఓడిపోవాలని ఎందుకు కోరుకుంటున్నారో ఇంత వరకు చెప్పనే లేదు. చెప్పకపోవడం వలన జగన్ ఆదేశం మేరకు పవన్ ఓడిపోవాలని ముద్రగడ కోరుకుంటున్నారని భావించవచ్చు.
కానీ ఎవరో కోరుకుంటే ఎవరూ ఓడిపోరని ఇంట్లో కూర్చొని శాపనార్ధాలు పెడితే అసలే ఓడిపోరని ఆయన ఇంకా ఎప్పుడు గ్రహిస్తారో? పిఠాపురంలో పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో గెలవడం దాదాపు ఖాయం అయిపోయింది కనుక ఆయన ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మారిపోయేందుకు ఏర్పాట్లు చేసుకుంటే మంచిది.




