రిలయన్స్ జియో… ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా ఇంత పాపులర్ అయిన పేరు మరొకటి లేదంటే అతిశయోక్తి కాదేమో. ఏ ప్రాంతమైనా, ఏ నోట విన్నా ఇదే పేరు స్మరించారు. సిమ్‌ను దక్కించుకునేందుకు పోటీలు పడ్డారు. కొన్ని ప్రాంతాలలో అయితే నిద్రాహారాలు మాని మరీ క్యూలో నిల్చున్నారు. దీనికి కారణం మూడు నెలల పాటు వాడుకున్న వారికి వాడుకున్నన్ని కాల్స్, డేటా ఫ్రీ కావడం. దీనికి తోడు 50కే 1జీబీ డేటా అని సంస్థ ప్రకటించడం.
సంచలనానికి కారణమైన ఈ ఆఫర్‌ను పరికించి చూస్తే… జియోలో అసలు అటువంటి ఆఫరే లేదని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఇప్పుడు దీనిపైనే చర్చంతా. నిజానికి రిలయన్స్ వెబ్ సైట్‌లో 50కే 1జీబీ డేటా అనే ప్లాన్ అన్నదే లేకపోవడం చిత్రం. కళ్లు కాయలు కాచేలా వెతికినా కనబడదు. సంస్థ వెబ్ సైట్ ప్రకారం… 19తో టారిఫ్‌లు మొదలవుతుండగా దాని కాలపరిమితి ఒక్క రోజే. రాత్రిపూట అన్ లిమిటెడ్ 4జీ డేటా ఉచితమని సంస్థ ప్రకటించింది. అయితే రాత్రి అంటే ఇక్కడ 2 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు అని అర్థం.
జియో యాప్స్ సబ్‌స్క్రిప్షన్ ఉచితమే కానీ 2017 జనవరి నుంచి మాత్రం కాదు. ఒకవేళ 499 పెట్టి 4జీ డేటా తీసుకుంటే అది అయిపోయాక ఏమవుతుందో తెలుసా? సంస్థ ప్రకటించినట్టు 50కే 1జీబీ రాదు, 10 కేబీ చార్జింగ్ పల్స్ చొప్పున 1జీబీకి 250 చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఇంచుమించు ఇంతే ధరతో ఇతర నెట్‌వర్క్ కంపెనీలు కూడా 1జీబీ డేటాను అందిస్తుండడం గమనార్హం. అదే పోస్టు పెయిడ్‌లో అయితే డేటా ఉచితంగా వస్తుంది కానీ స్పీడే… 128 కేబీపీఎస్‌కు పడిపోయి నత్తనడకను తలపిస్తుంది.
మరి ఫ్రీకాల్స్ సంగతేంటి? ఇక్కడ కూడా చిన్న మర్మం ఉంది. ఫోన్‌లోని డయలర్ ద్వారా చేసే కాల్స్ కు మాత్రమే ఇది వర్తిస్తుంది. వాట్సాప్, ఫేస్‌బుక్ మెసెంజర్, స్కైప్ ద్వారా చేసే కాల్స్‌కు మాత్రం డేటా చార్జీలు వర్తిస్తాయి. సో.. డేటా కరిగిపోయి చేతి చమురు వదిలిపోతుంది. అయితే కాల్స్ చేసే సమయంలో మొబైల్ డేటా ఆన్ చేయాల్సిన పనిలేకపోవడం చిన్న ఊరట. సో.. ఏ రకంగా చూసినా వినియోగదారుల జేబు గుల్లకావడం ఖాయం అంటూ సోషల్ మీడియాలో దీనిపై పెద్ద చర్చే జరుగుతోంది.



