తన అభిమానులతో సూపర్ స్టార్ రజనీకాంత్ భేటీ అవుతోన్న కార్యక్రమంలో ప్రముఖ దర్శకుడు ఎస్పీ ముత్తురామన్ ఓ ఆసక్తికరమైన ప్రశ్నను అభిమానులకు సంధించారు. రజనీ నివాస భవనంపై ఒక పూరి గుడిసె ఉంటుందని, అది ఎందుకు ఉంటుందో ఎవరికైనా తెలుసా? అంటూ చెన్నైలోని రాఘవేంద్ర కళ్యాణ మండపంలోని అభిమానులను దర్శకుడు ముత్తురామన్ ప్రశ్నించారు. అయితే సదరు ప్రశ్నకు అభిమానుల నుండి ఒక రకమైన మౌనం రావడంతో, సమాధానం చెప్తూ…
రజనీకాంత్ నిరాడంబరతకు ఆ పూరి గుడిసె నిదర్శనమని, తామిద్దరం కలిసిన మొదటి రోజు ఆయన తనతో ఎలా ఉన్నారో ఇప్పుడూ అలాగే ఉన్నారని చెప్పుకొచ్చారు. సినీ పరిశ్రమలో అవకాశాల కోసం ప్రయత్నిస్తూ, ఫిలిం ఇనిస్టిట్యూట్ లో చదువుతున్న సమయంలో చెన్నైలో కొంతమంది స్నేహితులతో కలిసి ఆయన ఒక గుడిసెలో ఉండేవారని గుర్తు చేసుకున్న ముత్తురామన్, ఇంత ఎదిగినా ఆయన దానిని మర్చిపోలేదని, అందుకే ఇప్పుడు ఆయన భవంతి పైన అలాంటి గుడిసె ఒకటి కట్టించారని అన్నారు.
‘రజనీ, ఇలా ఎందుకు చేస్తున్నావు?’ అనడిగితే… మనం ఎక్కడి నుంచి వచ్చామన్నది ఎప్పుడూ మర్చిపోకూడదనే సమాధానం తనకు లభించిందని తెలిపారు. అంత విశిష్ట వ్యక్తిత్వం రజనీకాంత్ దని, ఆయన సాయం చేయరని కొంతమంది ఆరోపణలు చేస్తుంటారని, ఆయన ఎప్పుడు, ఎవరికి, ఎలా ఇవ్వాలో తెలుసని, అలాగే చేస్తుంటారని, ఈ విషయం సినీ పరిశ్రమలో చాలా మందికి తెలుసని అన్నారు. మొదటి రోజు విజయవంతం అయిన అభిమానుల భేటీ రెండవ రోజు కూడా అంతే జోరుగా కొనసాగుతోంది.



