పవన్ కళ్యాణ్ మొన్న తొలిసారిగా హైదరాబాద్‌లో అడుగుపెట్టలేదు. ఎప్పటి నుంచో అక్కడే ఉన్నారు. కానీ ఎన్నడూ అయన ఆస్తులను ఎవరూ టచ్ చేయలేదని కేటీఆర్ చెప్పారు. రాజ్యాంగం ప్రకారం పవన్ కళ్యాణ్ హైదరాబాద్‌లో సమావేశం పెట్టుకోవచ్చని, ఎన్నికలలో పోటీ చేయవచ్చని అందుకే శాసనసభ, మునిసిపల్ ఎన్నికలలో జనసేన పోటీ చేసిందని కేటీఆర్ గుర్తు చేశారు కూడా.
మరి పవన్ కళ్యాణ్ హైదరాబాద్‌లో పార్టీ సమావేశం పెట్టుకుందామంటే ఎందుకు అడ్డుకున్నారు? అయన ప్రెస్‌మీట్ పెట్టి మాట్లాడితే అందరూ ఎందుకు అంత తీవ్రంగా రియాక్ట్ అవుతున్నారు?అంటే ప్రధాని మోడీ హైదరాబాద్ వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇళ్ళకు వెళ్ళి భేటీ అయినందునే అనే కొత్త పాయింట్ చెప్పారు తెలంగాణ బిజేపి అధ్యక్షుడు రాంచందర్ రావు.
“ఈ కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ నేతలకి అప్పుడే గుండెల్లో రైళ్ళు పరిగెత్తాయి. ఆ ఆందోళనతోనే కాంగ్రెస్ ప్రభుత్వం అయన సమావేశానికి అనుమతించలేదు. ఆ భయంతోనే బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ ప్రజలలో తెలంగాణ సెంటిమెంట్ రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తోంది.
తెలంగాణని వ్యతిరేకించిన మజ్లీస్ పార్టీతో సహా అందరినీ కేసీఆర్ చంకనెక్కించుకున్నారు. తెలంగాణ ఉద్యమకారులను రాళ్ళతో కొట్టినవారిని, పరిగెత్తించినవారిని కేసీఆర్ ఏరి కోరి తెచ్చుకొని మంత్రి పదవులు ఇచ్చారు. కానీ పవన్ కళ్యాణ్ తెలంగాణకు రాకూడదంటారు. ఇదేమి న్యాయం? పవన్ కళ్యాణ్ తెలంగాణకు వస్తే బిజేపితో ముడిపెట్టి ఎందుకు నిందిస్తున్నారు?
కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు రెండూ కూడా తెలంగాణ ప్రజల ఆకాంక్షలు తీర్చలేక, వారి సమస్యలు పరిష్కరించలేకపోవడంతో వాటిపై నుంచి ప్రజల దృష్టి మళ్ళించి తెలంగాణ సెంటిమెంట్ రాజేసి ఒడ్డున పడాలనుకుంటున్నాయి.
కేసీఆర్ ఆంధ్రా, మహారాష్ట్రలో బీఆర్ఎస్ పార్టీని విస్తరించాలనుకున్నప్పుడు మీకు తప్పు అనిపించలేదు. కానీ పవన్ కళ్యాణ్ తెలంగాణలో పోటీ చేస్తానంటే అందరికీ తప్పుగా కనిపిస్తోందా? అంటూ రామచందర్ రావు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలని కడిగేశారు.
రాంచందర్ రావు చెప్పినట్లు ప్రధాని మోడీ హైదరాబాద్ వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇళ్ళకు వెళ్ళి వారి కుటుంబ సభ్యులతో కాసేపు సరదాగా గడపడం బీఆర్ఎస్ పార్టీ నేతలు జీర్ణించుకోవడం చాలా కష్టమే.
కల్వకుంట్ల కవితని జైలు నుంచి విడిపించుకునేందుకు బిజేపిలో బీఆర్ఎస్ పార్టీని విలీనం చేసేందుకు సిద్ధపడిన కేసీఆర్, వచ్చే ఎన్నికలలో బిజేపితో పొత్తు పెట్టుకోవాలని ఆశపడటం సహజం.
కానీ ప్రధాని మోడీ బిజేపి-టీడీపి-జనసేన మూడు పార్టీలు కలిసి పోటీ చేయవచ్చని సంకేతం పంపినట్లయింది. ఇది కేసీఆర్‌కి పెద్ద షాకే. అందుకే పవన్ కళ్యాణ్‌ని చూసి ఈ ఉలికిపాటు!




