హైదరాబాద్‌లో ప్రతిపక్ష నాయకులకే కాదు… అధికార పార్టీ నాయకులకు కూడా గుండెల్లో గుబులు పుట్టిస్తోంది రేవంత్ రెడ్డి సృష్టించిన హైడ్రా సంస్థ.
హైదరాబాద్ నగరంలో దశాబ్ధాలుగా ప్రభుత్వ స్థలాలు, పార్కులు, చెరువులు, కాలువలు చివరికి శ్మశానలని కూడా రాజకీయ నాయకులు దర్జాగా కబ్జాలు చేసి విలాసవంతమైన భవనాలు, షాపింగ్ మాల్స్, ఫామ్‌హౌస్‌లు వగైరా నిర్మించుకున్నారు. కానీ ఏ ప్రభుత్వం వారి జోలికి పోయిన దాఖలాలు లేవు కానీ ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా తప్పకుండా పేదవారి ఇళ్ళు కూల్చివేస్తుంటాయి.
అత్యంత శక్తివంతమైన బడాబాబుల చేతుల్లో ఉన్న భూములను విడిపించాలంటే సాధారణ యంత్రాంగం సరిపోదని సిఎం రేవంత్ రెడ్డి గుర్తించారు.
అందుకే తన అధ్వర్యంలో, నలుగురు జిల్లా మంత్రులు, నాలుగు జిల్లాల కలెక్టర్లు, జీహెచ్‌ఎంసీ మేయర్, సీఎస్, డిజిపి, రెవెన్యూ, పురపాలక శాఖల కార్యదర్శులు, ఐఏఎస్ అధికారి రంగనాధ్ మెంబర్ కమీషనర్‌గా హైడ్రా అనే సంస్థని ఏర్పాటు చేశారు. కనుక దానిపై ఎవరి ఒత్తిడి చేయలేకపోతున్నారు.
అందుకే నేడు హైడ్రా అధికారులు, సిబ్బంది మాధాపూర్ సమీపంలో తుమ్మిడి కుంట చెరువుని కబ్జా చేసి ప్రముఖ నటుడు నాగార్జున నిర్మించుకున్న ‘ఎన్ కన్వెన్షన్ సెంటర్’ని కూల్చివేస్తున్నారు. ఆ చెరువులో 3.30 ఎకరాలు ఆక్రమించి దానిని నిర్మించారని గతంలోనే జీహెచ్‌ఎంసీ కూల్చేయబోయింది. కానీ నాగార్జున కేసీఆర్‌తో మాట్లాడటంతో కూల్చివేత నిలిచిపోయింది. కానీ ఇప్పుడు హైడ్రా నుంచి తప్పించుకోలేకపోయింది.
ఈరోజు ఉదయమే హైడ్రా సిబ్బంది భారీ యంత్రంతో అక్కడకి చేరుకొని కూల్చివేయడం మొదలుపెట్టారు. ఈసారి సిఎం రేవంత్ రెడ్డిని కలిసేందుకు నాగార్జున పరుగులు తీయలేదు. కలిసినా ప్రయోజనం ఉండదని గ్రహించిన్నట్లే ఉన్నారు.
దీని తర్వాత జన్వాడలోని తన ఫామ్‌హౌస్ కూల్చివేస్తారని కేటీఆర్ ముందే గ్రహించారు. అందుకే హైకోర్టులో బిఆర్ఎస్ నేత ప్రదీప్ రెడ్డి చేత పిటిషన్ వేయించారు. తాను ఆయన వద్ద లీజుకి తీసుకుని దానిలో నివసిస్తున్నానని కేటీఆర్ చెప్పుకుంటున్నారు.
కానీ అది కేటీఆర్‌దేనని, ప్రదీప్ రెడ్డి ఆయన బినామీ అని కాంగ్రెస్ నేతలు వాదిస్తున్నారు. కనుక ఒకవేళ జన్వాడ ఫామ్‌హౌస్ కేటీఆర్‌దే అయ్యుంటే హైడ్రా దానిని కూల్చివేస్తే కేటీఆర్ లోలోనే బాధపడాలి తప్ప బయటకు చెప్పుకోలేరు. బాడాబాబుల భవనాలను కూల్చివేసి ప్రభుత్వం భూములు విడిపించుకోవడం చాలా అభినందనీయమే. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇంకా ఎంత కాలం ఇంత ధైర్యంగా ముందుకు సాగగలరు? ఎందుకంటే అధికార, ప్రతిపక్షాలు వివిద రంగాలలో బడబాబులకి ఆగ్రహం కలిగితే అదే హైడ్రాతో రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చేయకుండా విడిచిపెడతారా?అనే సందేహం కలుగుతుంది.




