సినీ, రాజకీయ రంగాలకు – మీడియాకు ఉన్న అవినాభావ సంబంధం తెలియనిది కాదు. ఈ రెండు రంగాలలో రాణించాలంటే ఖచ్చితంగా మీడియా సహకారం ఉండి తీరాల్సిందే అన్న విషయం స్పష్టం. మరి ఈ రెండు రంగాలలో ఓ ప్రముఖ వ్యక్తిగా ఉన్న నందమూరి నటసింహం బాలకృష్ణ మీడియా రంగంలో కూడా కాలుమోపితే… అవును… ప్రస్తుతం మీడియా వర్గాలలో హల్చల్ చేస్తోన్న లేటెస్ట్ ‘బ్రేకింగ్’ సమాచారం ఇది.
అనంతపురం జిల్లా, హిందూపూర్ ఎమ్మెల్యేగా ఉన్న బాలకృష్ణ త్వరలోనే విజయవాడ కేంద్రంగా ఓ న్యూస్ ఛానల్ ను ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారంటూ మీడియా వర్గాల్లో వార్తలు గుప్పుమన్నాయి. ప్రస్తుతం ఏపీలో విధులు నిర్వహిస్తున్న మీడియా ఛానల్స్ అన్ని కూడా హైదరాబాద్ కేంద్రంగానే పని చేస్తుండడంతో, ఏపీ కేంద్రంగా ఓ పూర్తి స్థాయి ఛానల్ ను ప్రారంభించాలనేది ఈ ప్రాజెక్ట్ అసలు ఉద్దేశంగా కనపడుతోంది.
అలాగే అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి మద్దతుగా కొన్ని ప్రైవేటు ఛానల్స్ మద్దతు తెలుపుతున్నప్పటికీ, ప్రతిపక్ష పార్టీ వైసీపీకి ‘సాక్షి’ ఉన్నట్లు, టిడిపికి ఏ విధమైన ప్రత్యక్ష ఛానల్ లేదు. ఈ రకంగా బాలయ్య పెట్టబోయే ఛానల్ పార్టీ అవసరాలు కూడా తీరుస్తుందని టిడిపి వర్గాలు భావిస్తున్నాయి. బాలయ్యతో పాటు ఇతర రాజకీయ నాయకులు కూడా ఇందులో పెట్టుబడులు పెట్టేందుకు మాంచి ఉత్సాహంతో ఉన్నట్లుగా తెలుస్తోంది.



