“గీత గోవిందం” భారీ సక్సెస్ తర్వాత గత వారం వచ్చిన ‘యూ టర్న్’ సినిమా కలెక్షన్స్ పర్వాలేదనిపించే విధంగా ఉండగా, ఈ వారం మరో నాలుగు సినిమాలు తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇందులో రెండు “నన్ను దోచుకుందువటే, ఈ మాయ పేరేమిటో” తెలుగు సినిమాలు కాగా, రెండు “సామి2, కురుక్షేత్రం” తమిళ బొమ్మలు డబ్బింగ్ రూపంలో పలకరించాయి.
[m9ad]
ఈ నాలుగు సినిమాలలో కల్లా…. ప్రేక్షకులలో కాస్తంత బెటర్ టాక్ ను, సినీ విశ్లేషకుల దగ్గర నుండి కాస్తంత బెటర్ రివ్యూలను సొంతం చేసుకున్న సినిమాగా సుధీర్ బాబు “నన్ను దోచుకుందువటే” నిలిచింది. ఫస్టాఫ్ ఫన్ గా ఉన్నప్పటికీ, సెకండాఫ్ డల్ అయ్యిందన్న టాక్ వచ్చినప్పటికీ, ఓవరాల్ గా ప్రేక్షకుల చేత పాస్ మార్కులు వేయించుకోవడంలో “నన్ను దోచుకుందువటే” సక్సెస్ అయ్యింది.
మరో తెలుగు సినిమా “ఈ మాయ పేరేమిటో” పబ్లిసిటీ చేసినంత స్థాయి సినిమాలో లేదన్న టాక్ ను సొంతం చేసుకుంది. మరో ‘ఆర్.ఎక్స్ 100’ మాదిరి విజయవంతం అవుతుందని చిత్ర యూనిట్ ఆశించగా, అందుకు విరుద్ధంగా సినీ విశ్లేషణలు, మౌత్ టాక్ ఉన్నాయి. ఇక డబ్బింగ్ బొమ్మల పరిస్థితి మరీ దయనీయంగా మారింది. అర్జున్ ‘కురుక్షేత్రం’ రిలీజ్ అయ్యిందో లేదో కూడా చాలా మంది ప్రేక్షకులకు తెలియదని చెప్పడంలో సందేహం లేదు.
ఈ సినిమా కూడా రొటీన్ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిందన్న టాక్ ను సొంతం చేసుకుంది. అది కూడా ఏ మాత్రం పస లేకుండా చిత్రీకరణ ఉండడంతో, ప్రేక్షకుల మెప్పును పొందలేకపోతోంది. ఇక చియాన్ విక్రమ్ నటించిన ‘సామి’ అరుపుల పోలీస్ ఆఫీసర్ గా మిగిలిపోయాడు తప్ప, సిల్వర్ స్క్రీన్ పై ఆకట్టుకోలేకపోయారు. ఈ నాలుగింటిలో ‘నన్ను దోచుకుందువటే’ సినిమాకు మాత్రమే కాస్త ఊరటనిచ్చే టాక్ లభించింది.



