2024 అగ్నిపరీక్ష.. 2025 హ్యాపీ న్యూయర్

Chandrababu-Naidu-Amaravati Development

ఆంధ్రప్రదేశ్‌‌ ప్రజలకు 2024 సంవత్సరం ఓ రాజకీయ అగ్నిపరీక్ష పెట్టగా దానిలో 60 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. మెజార్టీ ప్రజలు కూటమికి మొగ్గు చూపడంతో ఆంధ్రప్రదేశ్‌‌ రాష్ట్రానికి మళ్ళీ మంచి రోజులు మొదలయ్యాయి. కనుక 2024 ఏపీకి చాలా మంచి చేసిందనే చెప్పొచ్చు. రాష్ట్ర ప్రజలు సరైన నిర్ణయం తీసుకుని సిఎం చంద్రబాబు నాయుడు, డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్‌లపై నమ్మకముంచి పగ్గాలు అప్పగించారు కనుక ఇక వారిదే పూర్తి బాధ్యత.

ADVERTISEMENT

ఇప్పటికే అమరావతి నిర్మాణ పనులకు టెండర్ల ప్రక్రియ మొదలైంది. మార్చి నుంచి జోరుగా పనులు మొదలవబోతున్నాయి. పోలవరం పనులకు కూడా రాష్ట్ర ప్రభుత్వం లైన్ క్లియర్ చేసింది. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకి అవసరమైన ప్రక్రియ జోరుగా సాగుతోంది.

రాష్ట్రానికి మళ్ళీ పరిశ్రమలు, భారీ పెట్టుబడులు తరలివస్తున్నాయి. అనకాపల్లి జిల్లా పూడిమడక వద్ద రూ.1,85,000 కోట్ల పెట్టుబడితో 1,600 ఎకరాలలో ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ అధ్వర్యంలో దేశంలోకెల్లా అతిపెద్ద (గ్రీన్) హైడ్రోజన్ ప్లాంట్‌ ఏర్పాటు కాబోతోంది. ఏపీలో మరో రూ.85,083 కోట్ల పెట్టుబడులతో 10 భారీ పరిశ్రమలు ఏర్పాటు కాబోతున్నాయి.

రాష్ట్రంలో ప్రధాన నగరాలను, పట్టణాలను అమరావతితో కలుపుతూ రోడ్ల నిర్మాణానికి చురుకుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అలాగే అమరావతిని ఇరుగు పొరుగు రాష్ట్రాలతో కలుపుతూ రైల్వేలైన్ల ఏర్పాటుకి రైల్వేశాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.

విశాఖ-విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల మద్యన భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 2025 డిసెంబర్‌లోగా ఇక్కడి నుంచి విమాన సర్వీసులు ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలల లోగానే ఇవన్నీ మొదలవడం ప్రభుత్వ నిబద్దతకు, పట్టుదలకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు.

2024 సంవత్సరం బాగానే ఆరంభం అయ్యింది.. ప్రభుత్వం శరవేగంగా ముందుకు సాగుతోంది. రాష్ట్రంలో, కేంద్రంలో ఏపీకి అన్ని విదాల అనుకూల రాజకీయ వాతావరణం కూడా నెలకొని ఉంది. కనుక 2025 నుంచి ఆంధ్రప్రదేశ్‌‌లో కళ్ళకు కనబడేవిదంగా అభివృద్ధి చెందబోతోంది. కనుక ఈసారి ఆంధ్రప్రదేశ్‌‌ ప్రజలకు 2025 నిజంగానే ‘హ్యాపీ న్యూఇయర్’ కాబోతోంది.

ADVERTISEMENT
Latest Stories