వైసీపీ మంత్రులు ప్రెస్‌మీట్‌లో లేదా సోషల్ మీడియాలో ఏం మాట్లాడుతుంటారో అందరికీ తెలుసు. ఎప్పుడూ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్‌లను విమర్శించడం లేదా అవహేళన చేస్తూ మాట్లాడుతుంటారు. కనీసం తమ ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పధకాల గురించి కూడా ఎవరూ సాధికారికంగా వివరించలేరంటే పరిస్థితి అర్దం చేసుకోవచ్చు. ఇక తమ శాఖల గురించి, వాటిలో జరిగే పనుల గురించి, ప్రాజెక్టులు, అభివృద్ధి పనుల గురించి ఏం మాట్లాడగలరు?
కానీ టిడిపి యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్రలో వివిద వర్గాల ప్రజలతో ముఖాముఖీ సమావేశాలు నిర్వహిస్తున్నప్పుడు, వారు వివిద అంశాలు లేదా రంగాలకు సంబందించి అడిగే ప్రతీ ప్రశ్నకు చాలా సాధికారికంగా, అందరికీ అర్దమయ్యేలా వివరిస్తున్న తీరు చూస్తే చాలా ముచ్చటేస్తుంది. నారా లోకేష్‌కు వివిద అంశాలు, రంగాలు, ప్రజా సమస్యలపై ఉన్న అవగాహన, పట్టు చూస్తుంటే ఆయన ముందు మంత్రులు కూడా దిగదుడుపే అనిపించకమానదు.
ఇందుకు తాజా నిదర్శనంగా యువగళం పాదయాత్రలో 159వ రోజు ప్రకాశం జిల్లాలో కనిగిరి నియోజకవర్గంలో పెద్దలవలపాడు వద్ద స్థానిక ప్రజలతో రచ్చబండ కార్యక్రమం గురించి చెప్పుకోవలసి ఉంటుంది.
ఓ యువతి ఫీజ్ రీఇంబర్స్‌మెంట్, ఉద్యోగావకాశాల గురించి ప్రశ్నించినప్పుడు, గతంలో తమ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వం నేరుగా ఆయా కాలేజీ యాజమాన్యలకు విద్యార్థుల ఫీజ్ రీఇంబర్స్‌మెంట్ చెల్లించేదని గుర్తుచేస్తూ మళ్ళీ తాము అధికారంలోకి వస్తే అదే విధానం అమలుచేస్తామని లోకేష్ చెప్పారు. ఇది ప్రభుత్వానికి-కాలేజీల యాజమాన్యాలకి మద్య జరిగే వ్యవహారంగానే ఉంటుందని చెప్పారు. తద్వారా విద్యార్థులకు, వారి తల్లితండ్రులకు ఫీజు చెల్లింపులు, ఆ కారణంగా హాల్ టికెట్స్, మార్క్స్ లిస్టుల గురించి ఆందోళన చెందవలసిన అవసరం ఉండదని చెప్పారు.
గతంలో చంద్రబాబు నాయుడు ప్రారంభించిన ఈ పధకాన్ని ఆ తర్వాత వైఎస్ రాజశేఖర్ రెడ్డి, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి, తెలంగాణ సిఎం కేసీఆర్‌తో అందరూ యదాతధంగా అమలుచేశారని కానీ ఈ జగన్ ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం పవిత్రమైన ఆ కార్యక్రమానికి పేర్లు మార్చేసి, ఫీజ్ రీఇంబర్స్‌మెంట్ చేయకుండా విద్యార్థుల జీవితాలతో ఆడుకొంటున్నారని నారా లోకేష్ ఆక్షేపించారు.
తమ జిల్లాలో యూనివర్సిటీ ఏర్పాటు చేయాలనే ఓ యువకుడికి సమాధానం చెపుతూ, జగన్ ప్రభుత్వం తమ రాజకీయ ప్రయోజనాల కోసమే జిల్లాలను అశాస్త్రీయంగా విభజించి అంతా అస్తవ్యస్తం చేసింది. మేము మళ్ళీ వాటిని శాస్త్రీయంగా సెట్ చేసిన తర్వాత, ఎక్కడ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తే ఎక్కువ మందికి ప్రయోజనం కలుగుతుందో అధ్యయనం చేసి ఏర్పాటు చేస్తాము. ఇక్కడ మీకు హామీ ఇచ్చేయలేను. ఎందుకంటే యూనివర్సిటీ ఏర్పాటు గురించి విద్యారంగంలో నిపుణులతో, అపార అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడుతో మాట్లాడిన తర్వాత నిర్ణయం తీసుకొంటామని నారా లోకేష్ చెప్పడం గమనిస్తే ఎన్నికలలో ఓట్ల కోసం గుడ్డిగా హామీలు ఇచ్చుకొంటూ పోవడం లేదని అర్దమవుతోంది.
గతంలో ఒక్కో జిల్లాలో లభించే సహజ,మానవ వనరులను బట్టి పరిశ్రమలను తెచ్చామని వాటి వలన లక్షలాది మందికి ఉద్యోగాలు, ఉపాధి లభిస్తున్నాయని, కానీ జగన్ ప్రభుత్వం వచ్చాక కొత్తగా పరిశ్రమలను తేకపోగా, ఉన్నవాటిని కూడా తరిమేశారని విమర్శించారు. టిడిపి అధికారంలోకి వస్తే 1.ప్రభుత్వోద్యోగాలు, 2.ప్రైవేట్ ఉద్యోగాలు, 3.వ్యవసాయం, 4.ఉపాధి రంగాలను ఏ విదంగా అభివృద్ధి చేసి ఉద్యోగాలు, ఉపాధి కల్పిస్తుందో నారా లోకేష్ వివరించారు.
ప్రభుత్వోద్యోగాల భర్తీ కోసం జాబ్ క్యాలండర్ ప్రకటించడమే కాకుండా, యూపీఎస్సీ తరహాలో ఏపీపీఎస్సీని కూడా స్వతంత్రంగా ఉద్యోగాలు భర్తీ చేసేవిదంగా అవసరమైన విధానపరమైన మార్పులు చేస్తామని చెప్పారు.
ప్రకాశం జిల్లాలో సాంప్రదాయ పంటలు వేయడం కంటే ఉద్యానవన పంటలవైపు మొగ్గు చూపితే బాగుంటుందని సూచించారు. గతంలో చంద్రబాబు నాయుడు శింగనమల, తాడిపత్రి నియోజకవర్గాలలో అరటిసాగుకు అనుకూలమైన వాతావరణం ఉందని తెలుసుకొని, అరటిపళ్ళు ఎగుమతి చేసే మూడు కంపెనీలను రప్పించి వాటిని స్థానిక రైతులతో అనుసంధానం చేశారు. ఇప్పుడు అక్కడ 8 కంపెనీలు అరటి రైతులకు అవసరమైన సహాయసహకారాలు అందిస్తూ, వారు పండించే అరటిపళ్ళను విదేశాలకు ఎగుమతి చేస్తున్నాయని నారా లోకేష్ చెప్పారు. అదేవిదంగా ప్రకాశం జిల్లాలో కూడా హార్టికల్చర్ సాగుకు సాగునీరు, భూసార పరీక్షలు, డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ వంటి అన్నిటినీ తమ ప్రభుత్వం అందిస్తుందని చెప్పారు.
నారా లోకేష్ ఇంకా చాలా అంశాల గురించి మాట్లాడారు. వాటన్నిటి గురించి చెప్పుకోవాలంటే వెబ్ సిరీస్‌లా చాలా అవుతుంది. కనుక నారా లోకేష్ ఏం చెప్పారు? ఆయన అవగాహన, నిబద్దత ఏవిదంగా ఉందని తెలుసుకొనేందుకు ఈ వీడియోని చూస్తే అర్దమవుతుంది.



