నేటి నుంచి తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం అయ్యాయి. కనుక ఆనవాయితీ ప్రకారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈరోజు తిరుమలకి వెళ్ళి స్వామివారిని దర్శించుకొని ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. ఈ సందర్భంగా టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ఆయనకు గొడ్డలి పోటు ఛాలెంజ్ విసిరారు.
ఐస్ బకెట్ ఛాలెంజ్, మొక్కలు నాటే ఛాలెంజ్, చేనేత దుస్తులు ధరించే ఛాలెంజ్ గురించి అందరూ వినే ఉంటారు. కానీ ఈ గొడ్డలి పోటు ఛాలెంజ్ గురించి విని ఉండరు. ఇంతకీ నారా లోకేష్ ఏమని సవాల్ విసిరారంటే, “వివేకాగారి హత్యతో నాకు, నా కుటుంబానికి సంబంధం లేదని 14-4-21న కలియుగ ఆరాధ్య దైవం వెంకటేశ్వర స్వామి సాక్షిగా ప్రమాణం చేశాను. బాబాయ్ హత్యతో మీకు, మీ కుటుంబ సభ్యులకు సంబంధం లేదని శ్రీవారి సాక్షిగా ప్రమాణం చెయ్యడానికి సిద్ధమా జగన్ రెడ్డి?ఈరోజు తిరుమల వెళ్తున్న మీరు ప్రమాణం చేస్తారా?లేక బాబాయ్‌పై గొడ్డలి పోటు జగనాసుర రక్త చరిత్ర అని ఒప్పుకుంటారా?” అంటూ ట్విట్టర్‌లో సవాల్ విసిరారు.
వివేకానంద రెడ్డి హత్య జరిగి మూడున్నరేళ్ళు అవుతోంది. సీబీఐ స్వయంగా రంగంలో దిగి దర్యాప్తు చేస్తున్నాకానీ ఆ కేసు ముందుకు సాగడం లేదు. ఏపీలో ఈ కేసు విచారణ ఎప్పటికీ పూర్తికాదని, కనుక ఈ కేసును పొరుగు రాష్ట్రమైన తెలంగాణ హైకోర్టుకి బదిలీ చేయాలని కోరుతూ వివేకా కుమార్తె, సిఎం జగన్మోహన్ రెడ్డికి వరుసకు సోదరి అయిన సునీతా రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. సొంత కుటుంబంలోనివారికే నమ్మకం లేదంటే ఏమనుకోవాలి? అందుకే వెంకన్న ఎదుట ప్రమాణం చేయాలని నారా లోకేష్ సవాలు విసిరారు.



