సామాన్య ప్రజలకి ఓ చిన్న బిజినెస్ స్టార్ట్ చేయాలంటే చాలా కష్టం కానీ శక్తివంతమైన ప్రభుత్వాలకు కాదు. అదేవిదంగా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా పెట్టుబడులు, పరిశ్రమలు, ఐటి కంపెనీలు రప్పించడం చాలా కష్టమే.
బహుశః అందుకేనేమో వైసీపీ అధికారంలోకి వచ్చాక యువతకు ఉపాధి కల్పించేందుకు అంటూ ఎక్కడికక్కడ చేపలు, మాంసం దుకాణాలు ఏర్పాటు చేయించింది. అయితే వైసీపీ చేసే ఏ పనిలోనూ చిత్తశుద్ధి, నిబద్దత ఉండవు కనుక ఆ దుకాణాలు కూడా చాలావరకు మూతపడ్డాయి.
జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన మూతపడిన ‘ఫిష్ ఇండియా’ దుకాణాల వద్ద టిడిపి యువనేత నారా లోకేష్ సెల్ఫీలు తీసుకొని సోషల్ మీడియాలో పెడుతున్నారు కూడా.
నారా లోకేష్ ప్రస్తుతం గన్నవరం నియోజకవర్గంలో 191వ రోజు యువగళం పాదయాత్ర చేస్తూ కేసరపల్లి వద్ద టిడిపి హయాంలో ఏర్పాటైన హెచ్‌సీఎల్ కంపెనీ ముందు సెల్ఫీ దిగి సోషల్ మీడియాలో పెట్టారు.
“చేపలదుకాణాలు, మాంసం కొట్లు కాదు… అసలు సిసలైన అభివృద్ధి అంటే ఇదీ జగన్! ఇది కృష్ణాజిల్లా గన్నవరం సమీపంలోని కేసరపల్లి వద్ద 2018లో నేను ఐటి మంత్రిగా ఉన్నపుడు తెచ్చిన హెచ్ సిఎల్ సాఫ్ట్ వేర్ కంపెనీ.
రూ.750 కోట్లతో ఏర్పాటైన ఈ సంస్థ 10వేలమందికి ఉద్యోగాలు కల్పించే సామర్థ్యంతో ఏర్పాటైంది. జగన్ మాదిరి మేం చదువుకున్న యువతతో చేపలదుకాణాలు, మటన్ మార్టులు పెట్టించలేదు, గంజాయి బానిసలుగా మార్చి మత్తులో ముంచలేదు. రాష్ట్రంలో వేలాదిమందికి ఉపాధి కల్పించే పరిశ్రమలను జె-ట్యాక్స్ కోసం పక్కరాష్ట్రాలకు తరిమేయలేదు. అభివృద్ధికి బ్రాండ్ చంద్రబాబుగారైతే, అరాచకానికి, విధ్వంసానికి కేరాఫ్ జగన్మోహన్ రెడ్డి!” అంటూ ట్వీట్ చేశారు.
నిజమే కదా?సర్వశక్తివంతమైన ప్రభుత్వం రాష్ట్రానికి పెట్టుబడులు, పరిశ్రమలు, ఐటి కంపెనీలు, వాణిజ్య సంస్థలను తీసుకువచ్చి యువతకు ఉద్యోగాలు కల్పించాలి కానీ చేపల దుకాణాలు, మటన్ షాపులు కాదు కదా?
జగన్ ప్రభుత్వం ఈ ఏడాది మార్చి నెలలో జగన్ ప్రభుత్వం విశాఖ నగరంలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ నిర్వహించింది. దాని నిర్వహణ కోసం, దాని ప్రచారం కోసం కొన్ని వందల కోట్లు ఖర్చు చేసింది. ఆ సదస్సులో ఏపీకి రూ.13.56 లక్షల కోట్ల పెట్టుబడులు, అనేక పరిశ్రమలు వాటితో ఆరు లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయని ఊదరగొట్టారు.
కానీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాద్‌తో సహా వైసీపీలో ఎవరూ ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదు. అంటే ఆ ప్రచారం, ఖర్చు, హడావుడి అంతా ప్రజలను మభ్యపెట్టేందుకేనా?



