టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నేడు టిడిపి నేతలను వెంటబెట్టుకొని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌ని కలిసి వైసీపీ అరాచకాలు, రాజకీయ వేదింపులు, అక్రమ కేసుల గురించి ఫిర్యాదు చేశారు. గవర్నర్‌ని కలిసి వచ్చిన తర్వాత నారా లోకేష్ మీడియాతో మాట్లాడుతూ, “ఈ నాలుగున్నరేళ్ళలో వైసీపి ప్రభుత్వం మా టిడిపి నేతలు, కార్యకర్తలపై సుమారు 60,000 కేసులు నమోదు చేసింది.
కేవలం మాపైనే కాదు… ప్రజలు, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలు, దళితులు, బీసీలు ప్రతీ ఒక్కరిపై కేసులు నమోదు చేస్తూనే ఉంది. బడుగు బలహీనవర్గాల మీద దాడులు, హత్యలు, అత్యాచారాలు చేసేది వారే. వారిపై మూత్రం పోసి అవమానించేది వారే. పెట్రోల్ పోసి సజీవ దహనం చేసేది వారే. తిరిగి కేసులు పెట్టేది వారే.
ప్రభుత్వాన్ని ఎవరు ప్రశ్నించినా, వైసీపి నేతలకు ఆగ్రహం కలిగినా కేసులు నమోదు కావలసిందే. ఇదేవిదంగా కొనసాగితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నివశిస్తున్న ప్రతీ ఒక్కరిపై ఏదో ఓ కేసు నమోదు చేయడం ఖాయం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల గురించే గవర్నర్‌కు వివరించి వైసీపి ప్రభుత్వాన్ని కట్టడి చేయాలని విజ్ఞప్తి చేశాము,” అని చెప్పారు.
శివుడి ఆజ్ఞలేనిదే చీమైనా కదలదన్నట్లు, ప్రధాని నరేంద్రమోడీ, అమిత్ షాల కనుసైగ చేయనిదే దేశంలో ఏ వ్యవస్థలో కదలిక రాదు. వారు తలుచుకొంటేనే ఏదైనా జరుగుతుంది. ఏదైనా ఆగిపోతుంది. అందుకే వైసీపి ప్రభుత్వం చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసి 50 రోజులు జైలులో ఉంచగలిగింది. వారు వద్దనుకొంటే వైసీపి నేతలు చంద్రబాబు నాయుడు దరిదాపుల్లోకి కూడా వెళ్ళగలిగేవారే కారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్వయంగా చెప్పారు. కనుక ఏపీలో నెలకొన్న పరిస్థితుల గురించి వారికి తెలుసునని అర్దమవుతోంది. వారికి తెలుసుననే విషయం టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కు తెలియదనుకోలేము.
అయినా టిడిపి ఎంపీలతో కలిసి రాష్ట్రపతి ముర్ముని కలిసి ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత ప్రధాని నరేంద్రమోడీని కలిసి ఫిర్యాదు చేశారు. అయినా కేంద్ర ప్రభుత్వం స్పందించలేదు. ఎప్పటిలాగే జగన్మోహన్ రెడ్డి, విజయ సాయిరెడ్డి ఢిల్లీ వెళ్ళి మోడీ, అమిత్ షాలతో భేటీ అవుతూనే ఉన్నారు. వారు కూడా జగన్, విజయసాయిలతో ఫోటోలు దిగుతూనే ఉన్నారు. తద్వారా వారు ఏపీ రాజకీయాల విషయంలో తమ వైఖరిని తెలియజేసిన్నట్లే భావించవచ్చు.
శివుడి ఆజ్ఞ లేదని తెలిసినప్పటికీ నారా లోకేష్ వెళ్ళి గవర్నర్‌కు మొర పెట్టుకొన్నారు. ప్రజాస్వామ్యంలో అదో ‘ఆప్షన్’ మాత్రమే. కనుక నారా లోకేష్ దానినీ వినియోగించుకొన్నారు. కానీ దాని వలన ఎటువంటి ఫలితమూ ఉండదని అందరికీ తెలుసు.




