అక్టోబర్ 1, శనివారం నాడు ఏపీ మంత్రివర్గ విస్తరణ జరగనుందని, లోకేష్ ను చంద్రబాబు తన క్యాబినెట్ లోకి పొలిటికల్ వర్గాల్లో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ప్రస్తుతం తెలుగుదేశం జాతీయ కమిటీలో కీలక పాత్రను పోషిస్తున్న లోకేష్ ను క్యాబినెట్ లోకి తీసుకోవాలని చాలా కాలం నుండి తెలుగుదేశం నేతలు, కార్యకర్తల నుంచి ఒత్తిడి వస్తుండగా, లోకేష్ జాతకం రీత్యా, అక్టోబర్ 1 మంచి ముహూర్తమని, ఆ రోజు మంత్రివర్గాన్ని విస్తరించాలని పండితులు చెప్పినట్టు సీఎం కార్యాలయం వర్గాలు వెల్లడించినట్లుగా ఈ కధనాల సారాంశం.
పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో కేసీఆర్ కుమారుడు కేటీఆర్ మంత్రిగా దూసుకెళుతుంటే, చంద్రబాబు కుమారుడు లోకేష్ కు ఆ స్థాయిలో పదవి లేకపోవడాన్ని చూసి చంద్రబాబు కుటుంబ సభ్యులే చిన్నబుచ్చుకున్నారని, లోకేష్ కు మంత్రి పదవి కోసం ఒత్తిడి తెస్తున్నారని గతంలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక వైకాపా నుంచి ఫిరాయించిన వారిలో కొంతమందికి మంత్రివర్గంలో స్థానం కల్పించేందుకు చంద్రబాబు స్వయంగా హామీలు ఇచ్చినట్టు కూడా తెలుస్తోంది.
ముఖ్యంగా భూమా నాగిరెడ్డి, జ్యోతుల నెహ్రూలను మంత్రివర్గంలోకి తీసుకోవడంతో పాటు, అలాగే ఇప్పటివరకు ప్రాతినిథ్యం లేని ముస్లిం వర్గం నుంచి ఒకరిని చోటు లభిస్తుందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే, ప్రస్తుతం ఉన్న క్యాబినెట్ నుండి ఓ నలుగురు మంత్రులకు ఖచ్చితంగా ఉద్వాసన లభిస్తుందని సమాచారం. దీంతో మరో రెండు వారాల్లో ఉందని ప్రచారం జరుగుతున్న ఏపీ క్యాబినెట్ విస్తరణపై పొలిటికల్ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.



