సాక్షి తన పై రాసిన తప్పుడు రాతలకు, అసత్య ప్రచారాలకు గాను ఆ సంస్థ మీద నారా లోకేష్ పరువు నష్టం దావా వేయడం, ఆ కేసు విచారణకై విశాఖ కోర్ట్ కి హాజరు కావడం జరుగుతూ వస్తున్న నేపథ్యంలో నేడు కూడా ఆ కేసు విచారణ నిమిత్తం విశాఖ చేరుకున్న నారా లోకేష్ మీడియా అడిగిన ప్రశ్నలకు తడబడకుండా బదులిచ్చారు.
అలాగే లోకేష్ కూడా మీడియాను అదే స్థాయిలో కంగారు పెట్టారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ నుంచి, దావోస్ పర్యటన, ఆపైన రాష్ట్రానికి రానున్న పెట్టుబడులు, ఇక ప్రస్తుతం ఏపీలో ముఖ్యంగా కూటమి పార్టీల మధ్య సాగుతున్న ‘డిప్యూటీ సీఎం’ వివాదం, టీడీపీ లో మొదలైన ‘కాబోయే సీఎం’ నినాదం వరకు మీడియా అడిగిన ప్రతి ప్రశ్నకు లోకేష్ తనదైన స్టైల్ లో ఆసక్తికరమైన సమాధానాలిచ్చారు.
లోకేష్ గారిని ఇక ముందు ఎలా చూడబోతున్నాం, డిప్యూటీ సీఎం లేక సీఎం అంటు మీడియా ప్రతినిధులు అడిగిన పదునైన ప్రశ్నకు గాను ఒక టీడీపీ కార్యకర్తగా అంటు బదులిచ్చిన లోకేష్ అటు పిమ్మట అందుకు కొనసాగింపుగా ఆ పదవిలో మిమ్మల్ని ఇప్పటి వరకు చూస్తూనే ఉన్నాం కదా అంటు మీడియా మరో మారు ప్రశ్నించగా అందుకు ఈ విధంగా బదులిచ్చారు లోకేష్.
అలాగే కొత్తగా డిప్యూటీ సీఎం లోకేష్ అంటు జరుగుతున్న చర్చ మీద కూడా స్పందిస్తూ నాకు అవసరం లేదు, చంద్రబాబు నాయుడు తనకు ఏ బాధ్యత అప్పగించినా అందుకు తానూ కష్టపడి పని చేయడానికి సిద్ధంగా ఉంటానని, అలాగే తనవల్ల పార్టీకి ఎటువంటి చెడ్డ పేరు తీసుకురానంటూ, తన యువగళం పాదయాత్ర కార్యక్రమాన్ని ఉదాహరణగా చూపించారు.
పార్టీ బలహీనమైన పరిస్థితులలో, అప్పటి వైసీపీ ప్రభుత్వం విధించిన ఆంక్షల వలయాలను దాటుకుని పార్టీ కార్యకర్తలతో పాటు పార్టీ నాయకులకు కూడా కొండంత అండగా నిలిచిన వైనాన్ని తెలియచేసారు. దీనితో తానూ పార్టీ బలోపేతం కోసం దేనికైనా రెడీ అనే బలమైన సంకేతాలను పార్టీ క్యాడర్ కి లీడర్లు కు పంపగలిగారు లోకేష్.
ఎవరు ఔనన్నా కాదన్నా టీడీపీ పార్టీ భవిష్యత్ నాయకుడు నారా లోకేష్ అనేది అందరికి తెలిసినప్పటికీ తానూ తన తండ్రి ఆదేశాల మేరకు నడుచుకుంటాను, ఒక పార్టీ కార్యకర్తగా పార్టీ బలోపేతానికి కట్టుబడి ఉంటాను అంటు వినయంగా సమాధానం చెప్పిన లోకేష్ తానూ ఇప్పటికే మూడు మార్లు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో ఈసారి ఆ పదవి నుండి వైతొలగాలని పార్టీలోని మరో వ్యక్తిగా ఆ బాధ్యతలు అప్పగించాలని కోరుకుంటున్నట్టు తెలియచేసారు.
ఒకప్పుడు మీడియా ముందుకు రావడానికి కూడా సంకోచించే లోకేష్ ఇప్పుడు ఇటువంటి కీలకమైన, కాంట్రావెర్సీ ప్రశ్నలకు కూడా ఎటువంటి ఊహాగానాలకు తావియ్యకుండా నిక్కచ్చిగా, నిస్సంకోచంగా సమాధానాలు చెప్పగలిగారు. ఇదే నాటి అపరిపక్వతకు నేటి పరిపక్వతకు మధ్య కనిపిస్తున్న వ్యత్యాసం. దీని బట్టి చూస్తే ఒక నాయకుడిగా, ఒక పార్టీ భవిష్యత్ గా ఎదగడానికి అవసరమైన అన్ని అంశాలను లోకేష్ క్షుణ్ణంగా అవపోసన పెట్టినట్టే కనిపిస్తుంది.




