ముంజేతి కంకణం చూసుకునేందుకు అద్దం అవసరం లేదన్నట్లు రాజకీయాలలో ఓ వ్యక్తి ఎదుగుదలని గుర్తించేందుకు ప్రత్యేక పరికరాలు అవసరం ఉండదు.
రాష్ట్ర రాజకీయాలలో ఆ విధంగా ఎదిగినవారే నారా లోకేష్. ఒకప్పుడు వైసీపీ చేత ‘పప్పు’ అనిపించుకున్న నారా లోకేష్ స్థానంలో మరో కోడిగుడ్డు ఉండి ఉంటే కుళ్ళి, పగిలిపోయేదే. కానీ నారా లోకేష్ కుమిలిపోకుండా ఆ వెక్కిరింతలు, అవహేళనలు దేనివల్లో తెలుసుకున్నారు.
వైసీపీ నేతలు ఎత్తి చూపిన తన ప్రతీ లోపాన్ని సరిదిద్దుకున్నారు. యువగళంతో ప్రజల మధ్య తనని తాను ఆవిష్కరించుకున్నారు!
నారా లోకేష్ గురించి తమ అంచనాలు తప్పడమే కాక ఆయన ఇంతగా రాటు తేలడానికి తామే తోడ్పడ్డామని వైసీపీ గ్రహించేసరికే చాలా ఆలస్యమైంది.
నారా లోకేష్‌లో ఈ మార్పు, తెలివితేటలు, సమర్ధత, నాయకత్వ లక్షణాలను ప్రధాని మోడీ కూడా గుర్తించారు. కనుకనే అభినందిస్తుంటారు.
కానీ పెరట్లో కోళ్ళు గుర్తించలేదు. అందుకే ఇంకా అవి కొక్కొరోకో అంటూ కూస్తూనే ఉన్నాయి. ఆ కూతలు వైసీపీ కడుపు మంటకి మంచి నిదర్శనం.
మంత్రి పదవులు వెలగబెట్టిన వారిని కానీ, 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న వారి అధినేతను గానీ ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పార్టీ నేతలు ఎవరైనా ఎన్నడైనా మెచ్చుకున్నారా? కనీసం వారి గురించి ఒక్కరైనా మంచిగా మాట్లాడారా?
చివరికి తమని ఆ కుర్చీలలో కూర్చోబెట్టిన బీఆర్ఎస్ పార్టీ నేతలు సైతం వైసీపీ పాలనలో ఏపీ దయనీయ పరిస్థితిలో ఉందని విమర్శిస్తూ ఉండేవారు కదా?
గురివింజ గింజ తన నలుపు ఎరుగనట్లు, వైసీపీ నేతలు కూడా తమ అవలక్షణాలు, లోపాలు, బలహీనతలు, తప్పులు దేనీనీ సరిచేసుకోరు. కానీ తమ విమర్శలని స్వీకరించి లోపాలు సరిదిద్దుకొని దూసుకుపోతున్న నారా లోకేష్‌ని వేలెత్తి విమర్శిస్తున్నారు!
నేడు నారా లోకేష్ వంద మంది జర్నలిస్టులతో బహిరంగంగా మాట్లాడుతున్నారు. వారి ప్రశ్నలను ధైర్యంగా ఎదుర్కొని జవాబులు చెపుతున్నారు. మరి వైసీపీ అధినేత అలా మాట్లాడగలరా?
కోడిగుడ్లు, రికార్డింగ్ డాన్స్, డర్టీ పిక్చర్స్, గంటా, అరగంటా బూతులు తప్ప ఏమున్నాయి మన గురించి చెప్పుకోవడానికి?అని ఆలోచిస్తే వారు కూడా మారవచ్చు.




