మాస్ పంచ్ లను వేస్తూ మంగళగిరి నియోజకవర్గంలో దూసుకుపోతున్న నారా లోకేష్, అధికార ప్రభుత్వ తీరు, సీఎంగా జగన్ మోహన్ రెడ్డి వేస్తోన్న పన్నులపై మరోసారి చెలరేగిపోయారు. అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని ధరలను తగ్గిస్తానని చెప్పిన జగన్ రెడ్డి, ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఒక్కో పన్నును పెంచుకుంటూ పోతున్నారని విమర్శించారు.
ప్రస్తుతం జగన్ రెడ్డి ఫ్రస్ట్రేషన్ పీక్స్ లో ఉందని, అందుకే ఆయన వెంట్రుకలు పీకే పనిలో ఉన్నారని, ఇప్పటికే ఆంధ్ర రాష్ట్ర ప్రజల వెంట్రుకలు పీకేసారని ఛలోక్తులు విసిరారు. పన్నుకో వెంట్రుక లెక్కలు వేసుకుంటే, ఇంటి పన్ను ఒకటి, చెత్త పన్ను ఒకటి, డీజిల్, పెట్రోల్ ధరలలో ఒకటి, గ్యాస్ ధరలలో ఒకటి, ఫ్రెష్ గా ఆర్టీసీ చార్జీలలో ఒకటి అంటూ జగన్ రెడ్డి వచ్చిన తర్వాత పెరిగిన వాటిని ప్రస్తావించారు.
ఇలా చెప్పుకుంటూ పోతే కందిపప్పు ధరల నుండి, చింతపండు, బియ్యం ధరలు పెరిగినందుకు పీక్కోవాలా? ఇక చివరికి ఏమి మిగలదు. ఆంధ్ర రాష్ట్రంలో జగన్ రెడ్డి ఒకే ఒక్క దాని మీద ఆయన పన్ను వేయలేదు, అది మనం పీల్చే గాలి మీదేనని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఏమో దానికి కూడా టైం వస్తుందేమో అంటూ జగన్ తీరును ఏకరువు పెట్టారు.
ఇటీవల కాలంలో పంచ్ ల పైన పంచ్ లు వేస్తూ మాస్ వర్గాలలో దూసుకుపోతున్న నారా లోకేష్ కు మీడియా కనపడగానే ఎక్కడలేని ఉత్సాహం వస్తోంది. ఏపీ సీఎం ఏమో అసలు మీడియా ముందుకు రాకపోగా, ప్రతిపక్ష నేత మాత్రం తన ప్రత్యర్థి మీడియా ఎక్కడుందా? అంటూ వెతికి మరీ పంచ్ లు వేస్తున్నాడు. తాజాగా కూడా ‘సాక్షి’ రాలేదా, పర్లేదులే ‘మనోడు వచ్చాడుగా’ అంటూ టీవీ9, ఎన్టీవీ ఛానెల్స్ ను ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు.



