మాట నిలబెట్టుకున్న లోకేష్… ఆర్డీటీకి గ్రీన్ సిగ్నల్!

Nara Lokesh meeting Mancho Ferrer after resolving RDT funding issue and restoring services in Andhra Pradesh

పేదల పెదవులపై చిరునవ్వు మళ్లీ మెరిసేలా చేసిన నిర్ణయం ఇది. చాలా రోజులుగా అనిశ్చితిలో ఉన్న రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ (ఆర్డీటీ)కు అడ్డంకులు తొలగడంతో, లక్షలాది మంది జీవితాల్లో వెలుగు తిరిగి కనిపించబోతోంది.

పేదోడి నోటి కాడ ముద్ద, నిరుపేదలకు అందని చదువును అందించిన విద్యాలయం, పైసలులేని వారికి వైద్యం అందించిన ఆరోగ్యాలయం, చిన్నారుల చిరునవ్వులకు కారణమైన సంస్థ. తెలుగు రాష్ట్రాల్లో ఆర్డీటీకి ఉన్న స్థానం అలాంటిది. అలాంటి సంస్థ ఒక్కసారిగా ఇబ్బందుల్లో పడటంతో ఆందోళన నెలకొంది.

ADVERTISEMENT

అయితే “ఆర్డీటీని కాపాడుకుంటాం” అని మాటిచ్చిన మంత్రి నారా లోకేష్, ఆ మాటను నిలబెట్టుకున్నారు. అసాధ్యం అనుకున్న సమస్యను తనదైన శైలిలో పరిష్కరించి చూపించారు. కేంద్రంతో చర్చలు జరిపి ఆర్డీటీకి ఎదురైన అడ్డంకులను తొలగించడంలో కీలక పాత్ర పోషించారు.

ఈ పరిణామాల నేపథ్యంలో ఆర్డీటీ నిర్వాహకుడు మాంచో ఫెర్రర్ మంగళవారం ఉండవల్లిలోని నివాసానికి వెళ్లి నారా లోకేష్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఇది ఒక వ్యక్తికి చెప్పే ధన్యవాదం కాదని, ఆర్డీటీ ద్వారా సేవలు పొందుతున్న లక్షలాది మంది తరఫున అందిస్తున్న ఆశీస్సులని ఆయన చెప్పడం గమనార్హం.

ఈ సందర్భంగా లోకేష్ స్పందిస్తూ, దశాబ్దాలుగా విద్య, వైద్యం, ఉపాధి, శిక్షణ రంగాల్లో ఆర్డీటీ చేస్తున్న సేవల ముందు తాను చేసినది చాలా చిన్నదేనని వినమ్రంగా వ్యాఖ్యానించారు.

గతంలో ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ కింద స్వచ్ఛంద సంస్థలకు విదేశీ నిధులపై కేంద్రం పరిమితులు విధించడంతో ఆర్డీటీకి నిధుల ప్రవాహం ఆగిపోయింది. ఈ సమస్యను ముందుగానే ఫెర్రర్ తన దృష్టికి తీసుకురాగా, “నేను ఉన్నాను” అని హామీ ఇచ్చిన లోకేష్, కేంద్ర పెద్దలతో చర్చలు జరిపి పరిష్కారానికి దారితీశారు.

“లక్షల మంది పేదల జీవితాల్లో వెలుగులు నింపిన ఆశాకిరణం ఆర్డీటీ. ఈ ట్రస్టును కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిదీ” అని ఇచ్చిన మాటను ఆయన నిలబెట్టుకున్నారు. సున్నితమైన అంశాన్ని సమయస్ఫూర్తితో హ్యాండిల్ చేసి, విదేశీ నిధుల రాకకు మార్గం సుగమం చేశారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులు కూడా వెలువడడం కీలక పరిణామంగా మారింది.

ఇక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ఈ వ్యవహారంలో చురుకైన పాత్ర పోషించారు. క్యాంప్ కార్యాలయంలో మాంచో ఫెర్రర్ ఆయనను కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఆర్డీటీ ఏపీలో దశాబ్దాలుగా చేస్తున్న సేవలను గుర్తు చేసుకుంటూ, ఇటీవల ఎదురైన సమస్యను పరిష్కరించేందుకు చంద్రబాబు కేంద్రమంత్రి అమిత్ షా దృష్టికి పలుమార్లు తీసుకెళ్లిన విషయం ప్రస్తావనలోకి వచ్చింది.

చివరికి కేంద్రం నుంచి క్లియరెన్స్ రావడంతో అన్ని అడ్డంకులు తొలగిపోయాయి. దీంతో ఆర్డీటీ సేవలు ఇకపై ఎటువంటి అంతరాయం లేకుండా కొనసాగుతాయని సీఎం స్పష్టం చేశారు.

మొత్తానికి, ఒక ట్రస్ట్‌కి వచ్చిన ఊపిరి, లక్షలాది పేదల జీవితాల్లో మళ్లీ ఆశను నింపింది. మాట ఇచ్చి నిలబెట్టుకోవడం అంటే ఇదే అనిపించేలా ఈ పరిణామం నిలిచిపోయింది.

ADVERTISEMENT
Latest Stories