Nara Lokesh TDP about Pegasus Softwareపెగాసస్ స్పైవేర్ అనే సాఫ్ట్ వేర్ ను ఇజ్రాయిల్ NSO సైబర్ గ్రూప్ నుండి కొనుగోలు చేసి ప్రముఖ జడ్జిల మీద., ముఖ్య జర్నలిస్ట్ ల మీద., ప్రతిపక్ష పార్టీ నేతల మీద నిఘా పెట్టడానికి దేశంలో బీజేపీ ప్రభుత్వంతో పాటు మరికొన్ని రాష్ట్రాల అధినేతలు గత ఎన్నికల సమయంలో కొనుగోలు చేశారని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు చేసారు.

ఇదే సంస్థ అప్పట్లో తమను కూడా సంప్రదించింది కానీ అందుకు మేము సమ్మతంగా లేమని చెప్పి ప్రజలు ముందుకు ఎన్నికల బరిలో నిలిచి విజయం సాధించాం అని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంలో చంద్రబాబు పేరును కూడా దీదీ ప్రస్తావించారు. అయితే మమతా ఆరోపణలను నారా లోకేష్ ఖండిస్తూ, మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈ సాఫ్ట్ వేర్ ని కొనుగోలు చేయలేదని మమతకు ఎవరో తప్పుడు సమాచారం ఇచ్చారని అన్నారు.

ప్రభుత్వానికి అనుకూలంగా ఒప్పందం చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ తమ అధినేత చంద్రబాబు ఇటువంటి నీచ రాజకీయాలను ప్రోత్సహించరని తెలిపారు. ఒకవేళ మేమే గనుక ఈ పెగాసస్ సాఫ్ట్ వేర్ ని కొనుగోలు చేసి అప్పటి ప్రతిపక్ష పార్టీ నేతల మీద ప్రయోగిస్తే ఇప్పుడు జగన్ సీఎం అయ్యేవారేనా? అంటూ ప్రశ్నించారు. ఎవరో చేసిన ఆరోపణలను పట్టుకుని తమ పై నిందలు వేయడం కాదు, ఆధారాలుంటే ప్రజల ముందు పెట్టండి. చట్టపరమైన చర్యలు తీసుకోండి జగన్ రెడ్డి అంటూ కాస్త గట్టిగానే కౌంటర్ ఇచ్చారు లోకేష్.

తెలుగుదేశం ప్రభుత్వంలో ఇటువంటి కార్యక్రమాలు జరిగితే జగన్ ప్రభుత్వం వచ్చి మూడేళ్లయినా తమపై జగన్ చర్యలు తీసుకోకుండా ఉంటారా? అంటూ వైసీపీ నేతలకు సూటి ప్రశ్నలు సంధించారు లోకేష్. ఈ వైసీపీ నాయకులకు ఆధారాలు లేని ఆరోపణలు చేయడం పరిపాటిగా మారిపోయిందని మండిపడ్డారు.

‘గుడ్డ కాల్చి ముఖం మీద వేసిన’ చందంగా ప్రతిసారి గత ప్రభుత్వంపై నిందలు వేసి, ఆ తరువాత హైకోర్టుతో మొట్టికాయలు వేయించుకోవడం జగన్ సర్కారుకు అలవాటైపోయిందని., ఇటువంటి విమర్శలతో టీడీపీ పార్టీని., కానీ టీడీపీ నాయకులను కాని ఈ జగన్ ప్రభుత్వం భయపెట్టలేదనే విషయాన్ని గుర్తుంచుకోవాలని వైసీపీకి గట్టి హెచ్చరికలే పంపారు లోకేష్.