ఏపీలో ఎన్నికల ప్రచారం మొదలైన నాటి నుంచి నేటి వరకు రాష్ట్రంలో హాట్ టాపిక్ గా నిలిచింది లోకేష్ రెడ్ బుక్. ఎదో చెపుతున్నాడు…ఎదో రాస్తున్నాడు…అవన్నీ సాధ్యమా…? అంటూ అప్పుడు అవహేళన చేసిన వైసీపీ నాయకులు ఇప్పుడు అదే రెడ్ బుక్ గురించి కంగారు పడుతున్నారు.
వైస్ జగన్ మోహన్ రెడ్డి మొదలుకుని ఆ పార్టీ నాయకులందరికీ ఇప్పుడు రెడ్ బుక్ టెన్షన్ పట్టుకుంది. వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అరాచకాలకు కూటమి ప్రభుత్వంలో చట్టపరంగా న్యాయం చేస్తాం అంటూ హామీ ఇచ్చారు లోకేష్. రెడ్ బుక్ తో వైసీపీ లెక్క మారబోతుంది అన్న సంకేతాలు ఇప్పటికే వైసీపీ నాయకులను హడలెత్తిస్తున్నాయి.
కూటమి ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టి వైసీపీ నాయకులను జైళ్లకు పంపిస్తుంది అని, ఎవరి స్థాయిలో వారు రెడ్ బుక్ లను సిద్ధం చేసుకుని వైసీపీ నాయకుల మీద కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతుందని, తిరిగి మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అందరి లెక్కలు సరి చేస్తాం అంటూ వైసీపీ అధినేత జగన్ టీడీపీ నాయకులను హెచ్చరిస్తున్నారు.
అయితే టీడీపీ నేతల వాదన మరోరకంగా ఉంది. తప్పుడు కేసులు కాదు తప్పు చేసిన ప్రతి ఒక్కడి మీద చట్టపరంగా కేసులు పెడుతున్నామని జగన్ హెచ్చరికలకు సమాధానం చెప్పే సమయం కూడా తమవద్ద లేదని వైసీపీకి టీడీపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. అయితే ఎవరి వాదన ఎలా ఉన్నా గత ప్రభుత్వంలో చట్టవ్యతిరేక పనులు చేసి తప్పించుకున్న ప్రతి వైసీపీ నేత ఇప్పుడు జైలుకు వెళుతున్నారు.
అందులో పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి మొదటి బోణి కొట్టారు. ఆ తరువాత లిస్ట్ లో మరిన్ని వైసీపీ పెద్ద తలకాయలు ఉన్నాయని సోషల్ మీడియాలో పెద్దఎత్తున ప్రచారం జరుగుతుంది. కోడుమూరు మాజీ ఎమ్మెల్యే పై కేసు నమోదవ్వడం అరెస్టు అవ్వడం జరిగిపోయింది. బాబు ఇంటి మీద దాడి చేసిన కేసులో జోగి రమేష్ మీద, టీడీపీ కేంద్ర కార్యాలయం దాడి కేసులో దేవినేని అవినాష్, లేళ్ళ అప్పిరెడ్డి పేర్లు బయటకొచ్చాయి.
అలాగే కాకినాడలో వైసీపీ మాజీఎమ్మెల్యే ద్వారంపూడి పై కేసు నమోదు చేసారు. ద్వారం పూడి అరాచకాలకు అష్టదిగ్బంధనం ఏర్పాటు చేసారు. ఎర్ర చందనం అక్రమ రవాణా వెనుక ఉన్న వైసీపీ ముఖ్య నాయకులకు ఉచ్చు బిగిస్తుంది. ఒకపక్క పవన్ తన శాఖల వారీగా సమీక్షలు జరిపి జరిగిన అవినీతిని బయటకు తీస్తున్నారు.
సంక్షేమ పథకాల లిస్ట్ లో తమ పేరు ఉందో లేదో అన్న ఆత్రుత లబ్ది దారులలో మొదలైనట్టు ఈ అవినీతి చిట్టా పొద్దులో తమపేరు ఉందో లేదో అన్న భయం వైసీపీ నేతలను వెంటాడుతుంది. ఒకవేళ ఇక్కడ తప్పించుకుని బయటపడిన రెడ్ బుక్ లో దొరికిపోతామేమో అనే సందేహం మరికొంత మంది వైసీపీ నేతలు వ్యక్తం చేస్తున్నారు.
ఇలా ఎవరి స్థాయిలో వారు తమ శాఖల మీద సమీక్షలు నిర్వహించి జరిగిన అవినీతిని శ్వేత పత్రం రూపంలో బయటపెట్టనున్నారు. ఇసుక, మైనింగ్, మద్యం ఇలా వైసీపీ అవినీతికి కాదేది అనర్హం అన్నట్టుగా ప్రతిఒక్కదానిలో వైసీపీ అవినీతికి పాల్పడినట్టు పక్కా ఆధారాలను సేకరిస్తున్నారు అధికారులు. ఇవన్నీ చేసిన వారు ఖచ్చితంగా రెడ్ బుక్ లో అర్హత సాధించినట్టే.
ఇలా గత ఐదేళ్లుగా అధికారాన్ని అడ్డుపెట్టుకుని ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడిన ప్రతి ఒక్కరి మీద చర్యలు ఉంటాయనేది స్పష్టమయింది. దీనితో లోకేష్ రెడ్ బుక్ చాల డేంజర్ గురు అంటూ వైసీపీలో గుసగుసలు వినపడుతున్నాయి. కనీసం లోకేష్ రెడ్ బుక్ లిస్ట్ బయటపెడితే నెక్స్ట్ ఎవరనేది తెలుసుకుని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవచ్చు అనే ఆలోచనలో ఉన్నారు వైసీపీ నేతలు.




