నారా లోకేష్‌ చేతిలో ఆ ఎర్ర డైరీ… ఎందరున్నారో దానిలో!

Nara-Lokesh-Red-Diaryటిడిపి యువనేత నారా లోకేష్‌ తాను తన తండ్రి చంద్రబాబు నాయుడులాగ ‘సాఫ్ట్‌’ కాదని, వైసీపీ నేతలను దెబ్బకు దెబ్బ కొడతానని యువగళం పాదయాత్రలో పదేపదే హెచ్చరిస్తూనే ఉన్నారు. సోమవారం పల్నాడు జిల్లా కారంపూడి బహిరంగసభలో మళ్ళీ మరోసారి గట్టిగా హెచ్చరించారు. ఈసారి చిత్తూరు ఎస్పీ రిషాంత్ రెడ్డిని తీవ్రంగా హెచ్చరించారు.

నారా లోకేష్‌ ఏమన్నారంటే, “ఎస్పీ రిషాంత్ రెడ్డి ఒంటిపై వైసీపీ కండువా వేసుకోలేదు కానీ వైసీపీ కార్యకర్తలాగే వ్యవహరిస్తున్నారు. మంత్రి పెద్దిరెడ్డి కనుసన్నలలో పనిచేస్తున్న ఎస్పీ రిషాంత్ రెడ్డి ఆ పోలీస్ యూనిఫారం తీసేసి వైసీపీ యూనిఫారం వేసుకొంటే మంచిది. ఇదివరకు నేను జిల్లాలో పాదయాత్ర చేస్తున్నప్పుడు ఎస్పీ రిషాంత్ రెడ్డి పోలీసులతో నన్ను అడ్డుకోవాలని చూశారు.

ADVERTISEMENT

ఇటీవల మా తండ్రిగారు, మా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పుంగనూరులో పర్యటిస్తున్నప్పుడు అదేవిదంగా వ్యవహరించారు. వైసీపీ కార్యకర్తలు చంద్రబాబు నాయుడుపై దాడులు చేస్తుంటే వారిని అడ్డుకోకపోగా తిరిగి మా పార్టీ నేతలు, కార్యకర్తలపై క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్ట్‌ చేశారు. మీడియా సమావేశంలో వారందరినీ నేలపై కూర్చోపెట్టి హంతకులన్నట్లు మాట్లాడటాన్ని నేను ఎంత మాత్రం సహించేది లేదు.

ఇప్పుడు వైసీపీ నేతల అండ చూసుకొని రెచ్చిపోతున్న ఎస్పీ రిషాంత్ రెడ్డితో సహా రాష్ట్రంలో ఎవరెవరు మా పార్టీ నేతలు, కార్యకర్తలని వేధిస్తున్నారో నేను ఈ డైరీలో ఎప్పటికప్పుడు నోట్ చేస్తున్నాను, అంటూ నారా లోకేష్‌ ఓ ఎర్ర డైరీని తీసి చూపించారు. మరో 9 నెలల్లో మేము రాష్ట్రంలో అధికారంలోకి రావడం ఖాయం. అప్పుడు ఈ డైరీలో ఉన్న ప్రతీ ఒక్క అధికారిని, వైసీపీ నేతలను విచారించి చట్ట ప్రకారం చర్యలు తీసుకొంటాము. ఎవరెవరు హద్దులు దాటుతున్నారో వారందరి యూనిఫారాలు విప్పించి, ఉద్యోగాలలో నుంచి తొలగించి జైలుకి కూడా పంపిస్తాను. ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మీ అందరి పేర్లు ఎప్పటికప్పుడు ఈ ఎర్ర డైరీలోకి ఎక్కుతూనే ఉన్నాయని మరిచిపోవద్దు,” అంటూ నారా లోకేష్‌ తీవ్రంగా హెచ్చరించారు.

చంద్రబాబు నాయుడు కూడా పోలీస్ అధికారులను పదేపదే హెచ్చరిస్తూనే ఉన్నారు. నిన్న ఉదయం పోలవరం పర్యటనకు వెళ్లినప్పుడు కూడా అక్కడే ఉన్న పోలీస్ అధికారులకు చేతులెత్తి మొక్కి, “మీ డ్యూటీ మీరు చేయండి కానీ వైసీపీ నేతల ఒత్తిడికి తలొగ్గి మీ పరిధి దాటి వ్యవహరిస్తూ మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నించవద్దని” విజ్ఞప్తి చేశారు. అలా చేస్తే రాజ్యాంగ వ్యతిరేకంగా వ్యవహరించినందుకు నేరం చేసిన్నట్లవుతుందని, చట్టాన్ని ఉల్లంఘించినందుకు అప్పుడు వారే ఇబ్బందులుపడాల్సి ఉంటుందని చాలా సున్నితంగా చెప్పారు.

టిడిపి ఎన్నటికీ అధికారంలోకి రాలేదని, చంద్రబాబు నాయుడుకి ఇవే చివరి ఎన్నికలంటూ వైసీపీ నేతలు ఆత్మవంచన చేసుకోవచ్చు. కానీ రాష్ట్రంలో ప్రభుత్వాధికారులు, పోలీస్ అధికారులు అలా ఆత్మవంచన చేసుకొంటే వారికే ప్రమాదం. రాష్ట్రంలో మారిన రాజకీయ వాతావరణం చూస్తే టిడిపి మళ్ళీ అధికారంలోకి రావడం ఖాయంగానే కనిపిస్తోంది. వస్తే నారా లోకేష్‌ ఎర్ర డైరీని బయటకు తీయకుండా ఉంటారా?ఆలోచించుకొంటే మంచిది.

ADVERTISEMENT
Latest Stories