ప్రజలు ధైర్యంగా మాట్లాడితే రాజకీయ నాయకులు తట్టుకోవడం చాలా కష్టమని గడప గడపకి కార్యక్రమంలో వైసీపీ నేతలకు ఎదురవుతున్న చేదు అనుభవాలు తెలియజేస్తున్నాయి. కనుక ప్రజల మద్యకు వెళ్ళాలంటే ఏ రాజకీయ నాయకుడికైనా కాస్త గుండె ధైర్యం అవసరమే.
అదీ… గత ఎన్నికలలో తమను తిరస్కరించిన ప్రజల వద్దకు వెళ్ళాలంటే ఇంకా కష్టం. కానీ టిడిపి యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్రతో నిర్భయంగా ప్రజల మద్యకు వెళ్ళడమే కాదు… వారు మొహం మీదనే ఆడుతున్న సూటి ప్రశ్నలకు ఏమాత్రం సహనం కోల్పోకుండా ఓపికగా సమాధానాలు చెప్పి వారిని మెప్పిస్తున్నారు.
కావాలి నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్నప్పుడు నారా లోకేష్ మహిళలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఓ మహిళ నారా లోకేష్‌ని సూటిగా ఓ ప్రశ్న అడిగారు. “మేము మా జీవనాధారమైన భూములు అమ్ముకొని మా పిల్లలను ఉన్నత చదువులు చదివిస్తే వారు ఉద్యోగాల కోసం హైదరాబాద్, బెంగళూరు లేదా అమెరికా, కెనడా దేశాలకు వెళ్ళిపోతున్నారు. ఇందుకోసమేనా మేము ఇన్ని కష్టాలు పడి వారిని చదివించింది?
ఏపీలో ఉద్యోగం చేస్తున్నామని చెప్పుకొనేవారు ఒక్కరూ లేరు. అందరూ పొరుగు రాష్ట్రాలకు, దేశాలకు వలసలు పోతూనే ఉన్నారు. ఏపీలో యువతని అన్ని రాష్ట్రాలు, దేశాలకు ఉపయోగపడుతున్నారు. కానీ వాళ్ళు తల్లితండ్రులకు, సొంత రాష్ట్రానికి పనికిరారా?అందరూ ఏపీని తీసిపడేస్తున్నారు. మా పిల్లలకు మన ఏపీలోనే ఎందుకు ఉద్యోగాలు కల్పించలేకపోతున్నారు?ఈ సమస్యకు ఎప్పటికైనా పరిష్కారం చూపిస్తారా లేదా?” అంటూ ఆ మహిళ నిప్పులు చెరిగారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇదొక అతిపెద్ద సామాజిక సమస్యగా మారిందనే విషయం ఎవరూ గుర్తించనట్లే లేదు. జగన్ ప్రభుత్వం అసలే గుర్తించలేదు!!! కనుక యువత ఇంజనీరింగ్ లేదా మరో ఉన్నత చదువులు చదువుకొని పొరుగు రాష్ట్రాలకు, పొరుగు దేశాలకు వెళ్ళిపోతుండటం ఓ నిరంతర ప్రక్రియగా సాగిపోతూనే ఉంది.
పిల్లలు పెద్ద ఉద్యోగాలలో స్థిరపడ్డారనే సంతోషమే తప్ప వారితో కలిసి జీవించేందుకు తల్లితండ్రులు నోచుకోవడం లేదు. అలాగే ఉద్యోగరీత్యా వారు కూడా తల్లితండ్రులతో కలిసి జీవించలేకపోతున్నారు.
ఆడపిల్లలకు పెళ్ళి చేస్తే పుట్టిల్లు వదిలి వెళ్ళిపోయిన్నట్లు మగపిల్లలు కూడా కాలేజీ గడప దాటగానే తల్లితండ్రులకు దూరమైపోతున్నారు. ఇది చేదు నిజం. ఇదే ఆ మహిళ తనకు తెలిసినవిదంగా చెప్పుకొని నారా లోకేష్‌ని నిలదీసిందని అర్దమవుతోంది.
ఆమె ఆవేదనను అర్దం చేసుకొన్న నారా లోకేష్ కూడా సూటిగా కానీ వినయంగా సమాధానం చెప్పారు. మేము మన యువతకు మన రాష్ట్రంలోనే ఉద్యోగాలు కల్పించాలనే ఉద్దేశ్యంతో అనంతపురంలో కియా కార్ల కంపెనీతో సహా పలు కంపెనీలను తీసుకువచ్చాము. చిత్తూరుకి మొబైల్ ఫోన్లు, టీవీలు తయారు చేసి కంపెనీలను, నెల్లూరుకి టైర్లు, పెయింట్ కంపెనీలు మోటార్ సైకిల్స్ తయారుచేసే హీరో కంపెనీని, విండ్ మిల్స్ తయారుచేసే కంపెనీలను తీసుకువచ్చాము.గోదావరి జిల్లాలకు ఆక్వా కంపెనీలు, విశాఖకు ఐటి కంపెనీలు, ఫార్మా కంపెనీలు ఇంకా అనేక కంపెనీలు తీసుకువచ్చాము.
ఈవిదంగా ఒక్కో జిల్లాలో లభ్యమయ్యే సహజ వనరులను బట్టి ఒక్కో రకమైన కంపెనీలను తీసుకువచ్చి యువతకు ఉద్యోగావకాశాలు కల్పించాము. టిడిపి ఎప్పుడూ కూడా పారిశ్రామికాభివృద్ధికి పెద్ద పీటవేస్తుంటుంది. మళ్ళీ అధికారంలోకి వచ్చినప్పుడు కూడా రాష్ట్రానికి పెద్ద ఎత్తున పరిశ్రమలు, ఐటి కంపెనీలను రప్పిస్తాము.
మన యువతకు మన రాష్ట్రంలోనే ఉద్యోగాలు, ఉపాధి కల్పిస్తాము. విశాఖను రాజధాని చేస్తామని, అప్పుడే ఉత్తరాంద్ర జిల్లాలు అభివృద్ధి చెందుతాయంటూ జగన్ ప్రభుత్వం మాయమాటలు చెపుతోంది. కానీ విశాఖను మేము ఐటి రాజధానిగా అభివృద్ధి చేసి నిజమైన అభివృద్ధి అంటే ఏమిటో వాళ్ళకీ అర్దమయ్యేలా చూపిస్తాము,” అని చెప్పారు.



