ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సామాన్య ప్రజలు అభివృద్ధి కోరుకుంటున్నారు. ఆ తర్వాతే సంక్షేమ పధకాలు కోరుకుంటున్నారు. కనుక సిఎం చంద్రబాబు నాయుడు ప్రజల ఆకాంక్షల మేరకు అమరావతి, పోలవరం పనులు వేగవంతం చేసి రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టి అభివృద్ధి చేసి చూపాలనుకుంటున్నారు.
మంత్రి నారా లోకేష్ యువగళం పాదయాత్రలో రెడ్ బుక్ చూపిస్తూ వైసీపి నేతలను కట్టడి చేసినప్పటికీ అధికారంలోకి వచ్చాక చాలా సంయమనం పాటిస్తూ అభివృద్ధికే ప్రాధాన్యం ఇస్తున్నారు.
నిన్న నియోజకవర్గంలో పర్యటించినప్పుడు పార్టీలకు అతీతంగా అందరం కలిసికట్టుగా నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేద్దామని, ఎన్నికలకు మూడు నెలల ముందు ఎవరి రాజకీయాలు వారు చేసుకుందామని నారా లోకేష్ అన్నారు. గత 5 ఏళ్లుగా రాజకీయాలతో వేశారిపోయిన మంగళగిరి ప్రజలు అదే కోరుకుంటున్నారు. కనుక నారా లోకేష్ ప్రతిపాదనను స్వాగతించారు. హర్షించారు.
అయితే నారా లోకేష్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పెద్ద చర్చే మొదలైంది. ముఖ్యంగా టిడిపి సానుభూతిపరులు దీనిని తప్పు పడుతున్నారు. అభివృద్ధి, సంక్షేమం అంటూ 5 ఏళ్ళు వైసీపిని దాని అధినేత జగన్మోహన్ రెడ్డిని ఉపేక్షిస్తే మనల్నే కాటేస్తారని వాదిస్తున్నారు. కనుక జగన్, వైసీపి నేతలపై గట్టి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఇదివరకు అంటే 2000లో కూడా ఇలాగే ఎన్నికల సమయంలోనే రాజకీయాలు మిగిలిన నాలుగున్నరేళ్ళు రాష్ట్రాభివృద్ధి అనే విధానంతో ముందుకు సాగినందుకు టిడిపి మళ్ళీ కోలుకోవడానికి 24 ఏళ్ళు సమయం పట్టిందని గుర్తుచేస్తున్నారు. 2014లో అధికారంలోకి వచ్చినప్పుడు అభివృద్ధిని మాత్రమే నమ్ముకోవడం వలన జగన్ టిడిపిని ఏవిదంగా చావు దెబ్బతీశారో ఓసారి గుర్తు చేసుకోవాలని టిడిపి శ్రేయోభిలాషులు హితవు పలుకుతున్నారు.
కనుక చిన్న పామునైనా పెద్ద కర్రతోనే కొట్టాలన్నట్లు విషసర్పం వంటి జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా నిర్వీర్యం చేయాలని హితవు చెపుతున్నారు. గత 5 ఏళ్ళలో చంద్రబాబు నాయుడుతో సహా టిడిపి సీనియర్ నేతలు, కార్యకర్తలు అనుభవించిన రాజకీయ వేధింపులు, కష్టాలను తలుచుకొని వారు జగన్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతుండవచ్చు. లేదా జగన్ పాలనలో భ్రష్టు పట్టిపోయిన రాష్ట్రాన్ని చూసి కడుపుమంటతో అంటుండవచ్చు. కానీ జగన్‌ని ఉపేక్షిస్తే కధ మళ్ళీ మొదటికి వస్తుందని హెచ్చరిస్తున్నారు.
కానీ సిఎం చంద్రబాబు నాయుడు ఇప్పటికే తమపై రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని, ఆయన ప్రోత్సాహంతోనే రాష్ట్రంలో వైసీపి నేతలు, కార్యకర్తలు, సానుభూతిపరులపై దాడులు జరుగుతున్నాయని జగన్ ఆరోపిస్తున్నారు. అంటే టిడిపి నేతలు, కార్యకర్తల ఒత్తిడికి తలొగ్గి సిఎం చంద్రబాబు నాయుడు తమపై ఎటువంటి చర్యలకు పూనుకోకుండా ముందే అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారనుకోవచ్చు. లేదా టిడిపి కూడా దౌర్జన్యాలకు పాల్పడుతోందని ప్రజలు అనుకున్నంత మంచితనం ఏమీ లేదని జగన్ ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నట్లు భావించాల్సి ఉంటుంది.
కనుక సిఎం చంద్రబాబు నాయుడు ఇప్పుడు సామాన్య ప్రజల ఆకాంక్షలను నెరవేర్చుతూనే, టిడిపి నేతలు, కార్యకర్తల ‘ఆకాంక్షలను’ కూడా నెరవేర్చవలసి ఉందన్న మాట.




