టిడిపి యువనేత నారా లోకేష్ కంటే ముందే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రత్యక్ష రాజకీయాలలోకి వచ్చారు. ఓసారి ఓదార్పు యాత్ర, మరోసారి పాదయాత్ర చేసిన అనుభవాలు కూడా ఉన్నాయి. తన బొమ్మతో సొంతంగా వైసీపీని నడిపిస్తున్నారు. పైగా దాదాపు నాలుగున్నరేళ్ళుగా ముఖ్యమంత్రి హోదాలో పనిచేస్తున్నారు కూడా. కనుక ఏవిదంగా చూసినా నారా లోకేష్ కంటే జగన్‌కు రాజకీయ అనుభవం ఎక్కువే ఉందని చెపొచ్చు.
కానీ నేటికీ సిఎం జగన్ బటన్ నొక్కుడు సభలలో తెలుగులో మాట్లాడేందుకు తడబడుతూనే ఉంటారు. రాష్ట్రంలో నీటి లభ్యత, విద్యుత్ ఉత్పత్తి, వినియోగం, సాగునీటి ప్రాజెక్టులు తదితర అంశాల ప్రస్తావన ఆయన ప్రసంగాలలో ఎన్నడూ వినబడదు. ఆయన ఏమి మాట్లాడుతారో అందరికీ తెలుసు. కనుక మళ్ళీ కొత్తగా చెప్పుకోనవసరం లేదు.
ఇక మంత్రులు, ఎమ్మెల్యేలకు వారి శాఖలు, జిల్లాలు, నియోజకవర్గాలలో అభివృద్ధి పనుల గురించి ఎన్నడూ మాట్లాడరు. వారు కూడా ఎంతసేపు జగన్, చంద్రబాబు, పవన్, లోకేష్ భజనతోనే కాలక్షేపం చేసేస్తుంటారు.
నారా లోకేష్ మొదట్లో చాలా తడబడేవారు. ఎక్కువగా ట్విట్టర్‌లోనే కనిపించేవారు. అది పట్టుకొని వైసీపీ నేతలు ఆయనను ఎంతగా ఆక్షేపించేవారో అందరికీ తెలుసు. అదే నారా లోకేష్…. యువగళం పాదయాత్రతో కొలిమిలో కాల్చి పదునెక్కిన కత్తిలా తయారయ్యారు.
ఒకప్పుడు వందమందితో ముఖాముఖీ మాట్లాడేందుకు తడబడే నారా లోకేష్ నిన్న గన్నవరంలో సుమారు రెండు లక్షల మంది ముందు అనర్గళంగా మాట్లాడి తనను విమర్శించినవారు సైతం ఆశ్చర్యపోయేలా చేశారు. నిజం చెప్పాలంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు కంటే నారా లోకేష్ ప్రసంగాలే చాలా ఆకట్టుకొంటున్నాయి. నిన్న గన్నవరం సభలో చేసిన ప్రసంగమే తాజా నిదర్శనం.
టీటీడీ ఛైర్మన్ కరుణాకర్ రెడ్డిని ‘కరుణా… కర్ర రెడ్డి’ అని సంబోధించడం, ఆయన కొత్తగా ‘కర్రల పధకం’ ప్రవేశపెట్టారని, భక్తులకు కర్రలు ఇచ్చి చిరుత పులులతో పొరాడి ప్రాణాలు కాపాడుకొమ్మని చెపుతున్నారని, మీ జగన్‌కు కూడా నేను ఓ కర్ర ఇచ్చి తాడేపల్లి ప్యాలస్‌లో పులిని వదులుతా… పోరాడుతారా?” అంటూ ప్రశ్నించినప్పుడు జనాలు ఈలలు, కేకలు వేస్తూ హర్షధ్వానాలు చేశారు.
జగన్ అమరావతిని చంపేస్తుంటే మొరగని వైసీపీ కుక్కలు, నేను కృష్ణాజిల్లాలో అడుగుపెడితే మొరుగుతున్నాయని నారా లోకేష్ ఎద్దేవా చేశారు.
గన్నవరం నడిబొడ్డున నిలబడి వల్లభనేని వంశీకి, కొడాలి నానికి తాటతీస్తానంటూ నారా లోకేష్ వార్నింగ్ ఇవ్వడం వంటివి సినిమాలలో పంచ్ డైలాగుల్లా పేలుతున్నాయి.
ఈ నేపధ్యంలో నారా లోకేష్, జగన్ ప్రసంగాలను పోల్చి చూసుకొంటే, ప్రజలను ఆకట్టుకొనేలా మాట్లాడటంలో జగన్ కంటే నారా లోకేష్ ఎంత మెరుగయ్యారో అర్దమవుతుంది. అదేవిదంగా రాష్ట్రానికి సంబందించిన అన్ని అంశాలపై నారా లోకేష్‌కి ఎంత పట్టు ఉందో కూడా అర్దమవుతుంది. యువగళం పాదయాత్ర పూర్తిచేసేసరికి నారా లోకేష్ మరింత రాటు తేలుతారని వేరే చెప్పక్కరలేదు. కనుక ఎన్నికలకు ఏడాది ముందు నుంచే నారా లోకేష్ యువగళం పాదయాత్ర చేయడం వలన టిడిపికి ఎంతో మేలు కలుగుతుంది.



