‘సిఎం’తో సై అంటున్న నారా లోకేష్!

nara lokesh with chandrababu naiduకొత్తగా బాధ్యతలు చేపట్టిన నారా లోకేష్ ను సిఎం చంద్రబాబు నాయుడు ఏమని సంభోదిస్తున్నారు? సహజంగా అందరినీ అయితే ‘మంత్రి గారు’ అని గౌరవంగా పిలవడం చంద్రబాబుకు అలవాటు. కానీ, లోకేష్ స్వయానా సొంత కొడుకు కావడంతో ఏ విధమైన పిలుపుతో పిలుస్తారా? అన్న ఆసక్తి పార్టీ వర్గాల్లో నెలకొంది. అయితే అందరి మంత్రులతో వ్యవహరించినట్టే, తనయుడు నారా లోకేష్ విషయంలోనూ గౌరవభావంతో ‘మంత్రి గారూ!’ అంటూ చంద్రబాబు సంబోధించడం విశేషం.

అమరావతిలో నిర్వహించిన రాష్ట్ర ఉపాధి హామీ మండలి సమావేశానికి చంద్రబాబు, లోకేష్ హాజరయ్యారు. లోకేష్ పాల్గొన్న తొలి సమావేశంలో… చంద్రబాబు చెప్పిన విషయాలను లోకేష్ ఓ నోట్ బుక్ లో రాసుకున్నారు. ఉపాధి హామీ అమల్లో ఇబ్బందులను జడ్పీ చైర్మన్లు ప్రస్తావించగా, ఆ సమస్యలను పరిష్కరించాలని లోకేష్ ను చంద్రబాబు ఆదేశించారు. ‘పెద్ద శాఖ అనుకున్నా కానీ, చాలా లోతైన శాఖే. స్టడీ చేస్తానని’ ఈ సందర్భంగా లోకేష్ చెప్పారు. ఈ సమావేశంలో సుమారు అర గంట పాటు లోకేష్ ప్రసంగించడం గమనార్హం.

ADVERTISEMENT

ఉపాధి హామీ అమలుపై సీఎం సూచనలు, ఆలోచనలను పొందుపరిచి నోట్ రూపొందించాల్సిందిగా అధికారులను లోకేష్ ఆదేశించారు. ఉపాధి హామీ కూలీల వేసవి భృతి 30 శాతం పెంచుతున్నట్ల్లు చంద్రబాబు ప్రకటించారు. 12 వేల కోట్ల మేర ఉపాధి పనులకు ప్రణాళికలు సిద్ధం చేయాలని, ఈ పనులు విజయవంతంగా నిర్వహించిన వారికి పురస్కారాలు అందజేస్తామని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో కాసేపు చిట్ చాట్ చేశారు కొత్తగా మంత్రి బాధ్యతలు చేపట్టిన నారా లోకేష్.

తాను పనిలో ముఖ్యమంత్రితోనే పోటీ పడతానని లోకేష్ స్పష్టం చేసారు. అమరావతిలో తనకు కీలక శాఖలు కేటాయించారని, ఛాలెంజింగ్ గా పని చేస్తానని అన్నారు. ఐటీలో తనకు ఉన్న పరిచయాలతో పెట్టుబడులు తీసుకు వస్తానని, తాను మంత్రి కాక ముందే పెట్టుబడుల కోసం ప్రయత్నించానని, వైఎస్సార్సీపీ అడ్డుపడిందని అన్నారు. అవినీతికి పాల్పడే వాళ్లు భయపడాలని, తనపై 420 కేసులు లేవని అన్నారు. తన ఛాంబర్ పెద్దగా ఉండాలనేమీ లేదని, ఏ పరిస్థితుల్లో నైనా పని చేస్తానని లోకేష్ చెప్పుకొచ్చారు.

ADVERTISEMENT
Latest Stories