టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేష్ జనవరి 27 నుంచి యువగళం పేరుతో పాదయాత్ర చేపట్టబోతున్నారు. ఈరోజు టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు దీని గురించి అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.
నారా లోకేష్ చిత్తూరు జిల్లా కుప్పం నుంచి శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురం వరకు 400 రోజులపాటు పాదయాత్ర చేయనున్నారు. అంటే ఎన్నికల షెడ్యూల్ వెలువడే వరకు పాదయాత్ర చేయనున్నారన్న మాట! ఈ పాదయాత్రలో రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల గుండా సాగుతూ, ఎక్కడికక్కడ అన్ని వర్గాల ప్రజలతో సమావేశమవుతూ ముందుకు సాగుతారు.
పనిలో పనిగా రాష్ట్రంలో టిడిపి నేతలు, కార్యకర్తలతో భేటీ అవుతూ పార్టీలో అంతర్గత సమస్యలను పరిష్కరిస్తూ, గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తారు. రాష్ట్రంలో వైసీపీ హయాంలో నానాటికీ పెరుగుతున్న దౌర్జన్యాలు, అరాచకాలు, అవినీతి గురించి ప్రభుత్వాన్ని నిలదీస్తూ, జగన్ అసమర్ద పాలనను ఎండగడతారు.
అమరావతి రైతులు అరసవెల్లి పాదయాత్ర చేస్తున్నప్పుడు వైసీపీ నేతలు వారిపై భౌతికదాడులు చేస్తూ ఏవిదంగా అడ్డుకొని పాదయాత్ర విరమించుకొనేలా చేశారో అందరూ చూశారు. అలాగే చంద్రబాబు నాయుడు జిల్లా పర్యటనలకి వస్తున్నప్పుడూ ఆయనపై వైసీపీ కార్యకర్తలు భౌతిక దాడులకి పాల్పడుతున్నారు. కనుక నారా లోకేష్ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేపట్టినప్పుడు కూడా వైసీపీ నేతలు ఆయనని అడ్డుకొనేందుకు ఏమైనా చేయవచ్చు.
ఒకవేళ తాము టార్గెట్ చేస్తే చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ తమ ఫస్ట్ టార్గెట్స్ అవుతారని, వారిని లేపేసి ఉండేవారిమని వైసీపీ నేతలు ఇదివరకే హెచ్చరించారు. కనుక పాదయాత్ర విజయవంతం చేయడంతో పాటు నారా లోకేష్‌కి పూర్తి భద్రత కల్పించడం కూడా చాలా అవసరమని, కనుక దాని కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసుకోవాలని టిడిపి నేతలు భావిస్తున్నారు.
ప్రతిపక్షాలపై వైసీపీ కార్యకర్తలు భౌతికదాడులకి పాల్పడుతుండటం, వారి సభలు, రోడ్ షోలు నిర్వహిస్తునప్పుడు విద్యుత్ సరఫరా నిలిపివేయడం వంటివి చేస్తున్నందున, అటువంటి దాడులను తట్టుకొంటూ, సమస్యలను ఎదుర్కొనేందుకు వీలుగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ‘వారాహి’ అనే ఎన్నికల ప్రచార వాహనాన్ని ప్రత్యేకంగా తయారుచేయించుకొన్న సంగతి తెలిసిందే. కానీ నారా లోకేష్ పాదయాత్ర చేస్తున్నందున మరిన్ని జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది. ఒకవేళ అమరావతి రైతులను అడ్డుకొని వెనక్కి తిప్పి పంపించేసినట్లే నారా లోకేష్ పాదయాత్రకి పోలీసుల అనుమతి లేదంటూ నిరాకరించినా ఆశ్చర్యం లేదు. కనుక అన్నీ లోతుగా ఆలోచించుకొనే అడుగు ముందుకు వేయాల్సి ఉంటుంది లేకుంటే సమస్యలు తప్పవు.



