టిడిపి యువనేత నారా లోకేష్ జనవరి 27మా కుప్పం నియోజకవర్గంలో యువగళం పాదయాత్ర మొదలుపెట్టారు. ఈ 189 రోజులలో లక్షలాదిమంది ప్రజలతో మమేకం అవుతూ వారి కష్టసుఖాలు తెలుసుకొంటూ, ఆర్ధికంగా చితికిపోయినవారిని ఆదుకొంటూ, వైసీపీ పాలనలో వేసారిపోయున్న ప్రజలకు భవిష్యత్‌పై భరోసా కల్పిస్తూ ముందుకు సాగుతున్నారు.
నేడు విజయవాడ నియోజకవర్గంలో సీతానగరంలో 2,500 కిమీ పాదయాత్ర పూర్తిచేసి అక్కడి ప్రజలకు చేసిన వాగ్ధానాలతో శిలాఫలకం ఆవిష్కరించారు. ఆ ప్రాంతంలో అసైన్డ్ భూములలో కొండ, వాగు,అటవీ, తదితర భూములలో నివశిస్తున్న నిరుపేదలకు టిడిపి అధికారంలోకి రాగానే వారికి ఆ స్థాలాలను క్రమబద్దీకరించి పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చ్హారు. నియోజకవర్గంలో ఇళ్ళులేని నిరుపేదలకు 20 వేల ఇళ్ళు నిర్మించి ఇస్తామని నారా లోకేష్ హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా నారా లోకేష్ ఓ ఆసక్తికరమైన విషయం చెప్పారు. “నేను గత ఎన్నికలలో మంగళగిరిలో ఓడిపోయాను. ఒకవేళ గెలిచి ఉంటే నేడు ఇంత పట్టుదలగా శ్రమించేవాడిని కానేమో? కానీ ఆనాడు ఓడిపోయినప్పటి నుంచి మళ్ళీ ఇక్కడి నుంచే గెలవాలనే కసితో పనిచేయడం మొదలుపెట్టాను. నా ఈ ఓటమితో నేను చాలా జీవిత పాఠాలు నేర్చుకొన్నాను. ఈసారి మంగళగిరి నుంచే నేను పోటీ చేయడం ఖాయం. భారీ మెజార్టీతో గెలవడం కూడా ఖాయం,” అని అన్నారు.
“ఆర్నెల్ల క్రితం యువగళం పాదయాత్ర మొదలుపెట్టినప్పటి నారా లోకేష్‌కు ఇప్పటి నారా లోకేష్‌కు చాలా తేడా ఉంది. ఈ పాదయాత్రతో నేను ఒక్కో జిల్లా, ఒక్కో ప్రాంతంలో ప్రజలు పడుతున్న కష్టాలను స్వయంగా చూసి తెలుసుకొన్నాను. ఆ ప్రాంతాలకు, ప్రజలకు వేర్వేరు సమస్యలు, అవసరాలున్నాయని తెలుసుకొన్నాను.
ముఖ్యంగా సాగునీటి ప్రాజెక్టుల పరిస్థితి, వాటి ఆవశ్యకతని బాగా తెలుసుకొన్నాను. ఈ పాదయాత్ర సగం పూర్తి చేసేసరికే నాకు తెలియని చాలా విషయాలు నేర్చుకొన్నాను. వాటిపై పూర్తి అవగాహన ఏర్పడింది. ఇప్పుడు నా చేతిలో నేను పూర్తిచేయవలసిన పనుల జాబితా చాలా పెద్దదే ఉంది. టిడిపి అధికారంలోకి రాగానే నేను ఇచ్చిన అన్ని హామీలను అమలుచేస్తాను.
ఆయా జిల్లాలలో పెండింగులో ఉండిపోయిన సాగునీటి ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన పూర్తిచేస్తాను. పరిశ్రమలు, ఐటి కంపెనీలను రప్పించి భారీగా ఉద్యోగావకాశాలు కల్పిస్తాను. అన్ని తప్పకుండా పూర్తిచేసి మళ్ళీ ప్రజలందరినీ కలుసుకొని వారి ఆశీర్వాదాలు తీసుకొంటాను,” అని నారా లోకేష్ అన్నారు.
నారా లోకేష్ నేడు ఉండవల్లిలో ప్రవేశించినప్పుడు అక్కడ ప్రజావేదిక శిధిలాలను చూసి ఆగి సెల్ఫీ తీసుకొని సోషల్ మీడియాలో దానిని పోస్ట్ చేశారు. “జగన్ అధికారంలోకి రాగానే ఇదిగో ఇక్కడి నుంచే తన విధ్వంస పరిపాలన మొదలుపెట్టారు. నాలుగేళ్ళ క్రితం మొదలైన ఆ విధ్వంస పాలననుకు నేటికీ తొలగించని ఈ ప్రజావేదిక శిధిలాలే నిదర్శనంగా జగన్ ఉంచాడు,” అని ట్వీట్ చేశారు.
అక్కడి నుంచి ప్రకాశం బ్యారేజి మీదుగా విజయవాడ నగరంలోకి నారా లోకేష్ ప్రవేశిస్తున్నప్పుడు బ్యారేజి 2 కిమీ పొడవునా జనాలతో నిండిపోయింది. ప్రకాశం బ్యారేజి దాటి కనకదుర్గమ్మ పాదాల చెంతకు చేరుకొన్నప్పుడు పసుపు, ఎరుపు జెండాలతో ఆ ప్రాంతానికి పసుపుకుంకుమలు అద్దిన్నట్లుగా చాలా ఆహ్లాదకరంగా మారింది.
నారా లోకేష్ యువగళం పాదయాత్రతో ప్రకాశం బ్యారేజి నిండిపోగా, దిగువన కృష్ణానదిలో కూడా టిడిపి కార్యకర్తలు పసుపు, ఎరుపు జెండాలు తగిలించుకొని బోట్లలో నారా లోకేష్ వెంటసాగడం మరో అద్భుతమైన దృశ్యమే.
చూస్తుండగానే నారా లోకేష్ 188 రోజులు పాదయాత్ర చేశారు. అనేక అవరోధాలు ఎదుర్కొంటూనే 2,500 కిమీ పాదయాత్ర కూడా పూర్తిచేశారు. ఇన్ని రోజులు, ఇంత దూరం, ఇంత అనుభవం సంపాదించుకొన్నందున, శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురం వరకు మిగిలిన 1,500 కిమీ పాదయాత్ర ఇంతకంటే చాలా గొప్పగానే సాగుతుంది.



