కొండను తవ్వి ఎలుకను కూడా పట్టలేదు!

r-narayana-murthy-fires on -theaters-strike-called offడిజిటల్ సర్వీస్ రేట్లు తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఇటీవల చేపట్టిన బంద్ ద్వారా ఏం సాధించారని తెలుగు ఫిలిం చాంబర్‌ పై ఆర్.నారాయణమూర్తి విరుచుకుపడ్డారు. కొండను తవ్వి ఎలుకను కూడా పట్టలేదని తీవ్ర స్థాయిలో వ్యాఖ్యానించారు. దాదాపు వారం పాటు కొనసాగిన బంద్‌ ను శుక్రవారం విరమించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తెలంగాణ ఫిలించాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ ప్రతాని రామకృష్ణ గౌడ్, ఆర్.నారాయణమూర్తి కలిసి ఫిలిం చాంబర్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు.

ADVERTISEMENT

తమిళనాడు, కర్ణాటక, కేరళలో బంద్ కొనసాగుతుంటే ఇక్కడ మాత్రం ఎందుకు విరమించారని, హామీలు అమలు కాకుండా బంద్‌ ను ఎలా విరమిస్తారని నిలదీశారు. బంద్ వల్ల సినీ కార్మికులు ఇబ్బంది పడడం ఒక్కటే జరిగిందని, ఇంకేమీ ఒరిగింది లేదని విమర్శించారు. నిర్మాతలకు మంచి జరుగుతుందనే ఉద్దేశంతో అందరూ సహకరించారని, ప్రేక్షకులు కూడా మద్దతు ఇచ్చారని నారాయణమూర్తి అన్నారు. అయితే కొందరి స్వార్థ ప్రయోజనాల కోసం బంద్‌ను ఉన్నపళంగా విరమించుకోవడం సరికాదని తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

సురేష్ బాబు, జెమినీ కిరణ్, అల్లు అరవింద్ వంటి పెద్దలు ఈ సమస్యను ముందే పరిష్కరించి ఉంటే సరిపోయేదని అన్నారు. రామానాయుడు, దాసరి నారాయణరావులు ఎప్పుడూ నిర్మాతల మంచి కోరేవారే కానీ, ఎప్పుడూ స్వార్థ ప్రయోజనాల కోసం వెంపర్లాడలేదన్నారు. డిజిటల్ సర్వీస్‌లు అందిస్తామని కొత్తవారు వస్తున్నా, వారిని అడ్డుకుంటున్నారని ఆరోపించారు. వారికే కనుక అవకాశం ఇస్తే క్యూబ్, యూఎఫ్ఓ వంటి వాళ్లు తప్పకుండా దిగి వస్తారని పేర్కొన్న నారాయణమూర్తి, ఈ విషయంలో ప్రతి ఒక్కరికీ మంచి జరగాలన్నదే తన అభిమతమని పేర్కొన్నారు.

ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ ఉచితంగా ఇచ్చే వరకు థియేటర్స్ బంద్ ఆపేది లేదని చెప్పి ఇప్పుడు 2 వేలు తగ్గించగానే ఆపేయడం సరికాదన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకుని అందరికీ న్యాయం చేయాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. ఇదంతా జరిగిన తర్వాత…. “రెండు వేల కోసమా ఇంత హంగామా చేసింది” అంటూ విస్తుపోవడం ప్రేక్షకుల వంతవుతోంది. అందుకే ఆర్.నారాయణమూర్తి విమర్శలు చేయడంలో తప్పేమీ లేదని మద్దతు లభిస్తోంది.

ADVERTISEMENT
Latest Stories