‘ప్రత్యేక హోదా’ అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజల సెంటిమెంట్ కాదని, ఇలా సెంటిమెంట్ లు అనుకుంటూ ఇస్తే దేశంలో ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా ఇదే రీతిన అడుగుతారు కనుక ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇచ్చేది లేదని తెలుగు ప్రజానీకాన్ని అవమానించిన కేంద్ర ఆర్ధికమంత్రి మాటల వెనుక ఆంతర్యం రాజకీయ విజ్ఞులు ముందుగానే పసిగట్టారు. ఈ వ్యాఖ్యలు పరోక్షంగా ఇతర రాష్ట్రాలకు ‘స్పెషల్ స్టేటస్ కావాలని ఉద్యమం చేయాల్సిందిగా’ ఉప్పందించడమేనని రాజకీయ విశ్లేషకులు స్పష్టంగా పేర్కొన్నారు.
ఇదంతా రెండు రోజుల క్రితం మాటలు… కట్ చేసి నేటికి వస్తే… కేంద్ర ప్రభుత్వానికి మిత్రపక్షంగా ఉన్న బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తమకు ‘ప్రత్యేక హోదా’ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అరుణ్ జైట్లీ చేసిన వ్యాఖ్యల తదుపరి… దేశంలో ఏదొక రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ డైలాగ్ వేస్తారని అంచనాలు వేయగా, ఇప్పుడు అది నితీష్ కుమార్ నోటి వెంట వచ్చింది. ఇదంతా మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ మరియు ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీల దిక్కుమాలిన రాజకీయానికి నిదర్శనంగా పేర్కొన్నవచ్చు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడకుండా ఎలాగైనా తప్పించుకోవాలని ప్రయత్నిస్తోన్న కేంద్ర ప్రభుత్వం ఇంతకుమించిన రాజకీయం ఏం చేస్తుందిలే! నాడు సరైన విభజన బిల్లును రూపొందించకుండా కాంగ్రెస్ అన్యాయం చేయగా, కాంగ్రెస్ చాలా ఉత్తమం అనిపించే విధంగా బిజెపి అధిష్టానం ప్రవర్తిస్తోంది. దీంతో ఈ ప్రభుత్వం మరో ఏడాదిలో పడిపోయి, కాంగ్రెస్ పార్టీ గానీ, థర్డ్ ఫ్రంట్ గానీ అధికారంలోకి రావాలన్నది తెలుగు ప్రజల ఆకాంక్ష. విశేషం ఏమిటంటే… కేంద్రంలో ఉన్న రెండు జాతీయ పార్టీలు తమ పైశాచిక రాజకీయాలను ఏపీ జనాల పైనే రుద్దటం!



