మీడియాలకు 2000 కోట్లు షాక్ ఇచ్చిన మోడీ!

narendra modi demonetization effect to mediaపెద్ద నోట్ల రద్దు అంశంపై అన్ని ప్రధాన మీడియాలు తొలుత ప్రశంసించాయి. దేశానికి కీలక ‘టర్నింగ్ పాయింట్’గా అభివర్ణించాయి. అయితే, రోజులు గడుస్తున్న కొద్దీ మీడియాల వైఖరిలో మార్పు స్పష్టంగా కనపడుతోంది. రానూ రానూ మోడీ అనుసరిస్తున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా కధనాలను ప్రసారం చేస్తుండగా, తాజాగా తీసుకున్న బంగారంపై నియంత్రణతో అది కాస్త పతాక స్థాయికి చేరుకుంది. ఇదిలా ఉంటే, అసలు ప్రకటనలు లేక మీడియా రంగం విలవిలలాడుతోందనేది గమనించాల్సిన విషయం.

ADVERTISEMENT

కేవ‌లం ప్ర‌క‌ట‌న‌ల‌ పైనే ఆధార‌ప‌డే దిన‌ప‌త్రిక‌లు, టీవీ చాన‌ళ్లు, రేడియోలు తాజా పరిణామాలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, నోట్ల ర‌ద్దుతో ఇప్ప‌టి వ‌ర‌కు దాదాపుగా 1500 నుండి 2000 కోట్ల వరకు న‌ష్టాన్ని చవిచూసినట్లు ప్రాధమిక అంచ‌నా. పెద్ద నోట్ల ర‌ద్దుతో ఖ‌ర్చును భారీ స్థాయిలో త‌గ్గించుకుంటున్న కార్పొరేట్ సంస్థ‌లు, మొత్తంగా ప్ర‌క‌ట‌న‌లు ఇవ్వ‌డం ఆపేసిన‌ట్టు ప్రముఖ బిజినెస్ దినపత్రక ‘ఎక‌న‌మిక్ టైమ్స్’ ఓ క‌థ‌నంలో పేర్కొంది.

వాస్తవానికి నోట్ల ర‌ద్దు ప్ర‌భావం తాత్కాలిక‌మేన‌ని, త్వ‌ర‌లోనే అంతా స‌ర్దుకుంటుంద‌ని భావించామ‌ని, అయితే త‌మ అంచనా తప్పయినట్లుగా సదరు క‌థ‌నంలో పేర్కొన్నారు. చాలా కంపెనీలు త‌మ ప్ర‌క‌ట‌నల వ్య‌యాన్ని పూర్తిగా త‌గ్గించేసుకున్నాయ‌ని, డిసెంబ‌రులో ఇది మ‌రింత తీవ్ర‌రూపం దాల్చే అవ‌కాశం ఉంద‌ని మ‌రో సంస్థ‌కు చెందిన చీఫ్ ఎగ్జిక్యూటివ్ తెలిపారు. ప్ర‌క‌ట‌న‌ల రంగానికి త‌క్కువ‌లో త‌క్కువ‌గా 1500 కోట్ల న‌ష్టం వాటిల్లి ఉంటుంద‌ని అంచనా వేస్తున్న‌ట్టు ‘డెంట్స్ ఏజిస్ నెట్‌వ‌ర్క్’ ద‌క్షిణాసియా సీఈవో ఆశిష్ భాసిన్ తెలిపారు.

ఈ ఏడాది 50 వేల కోట్ల ప్ర‌క‌ట‌న‌లు వ‌స్తాయ‌ని అంచ‌నా వేశామ‌ని, కానీ త‌మ అంచ‌నాలు త‌ల్ల‌కిందులు అవుతున్నాయ‌ని ఈ సందర్భంగా ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఈ న‌ష్టాల నుంచి గ‌ట్టెక్కేందుకు ఎంత లేదన్నా మూడు నాలుగు నెల‌ల స‌మ‌యం ప‌డుతుంద‌ని ఐజీపీ మీడియా బ్రాండ్స్ సీఈవో శ‌శిసిన్హా పేర్కొన్నారు. మోడీ నోట్ల సెగ మీడియా రంగాన్ని కూడా బాగానే కుదిపేసినట్లుగా కనపడుతోంది. అయితే ప్రింట్ మీడియాతో పోలిస్తే… కొంతలో కొంత ఎలక్ట్రానిక్ మీడియా కాస్త ఊపిరి పీల్చుకున్నట్లుగా తెలుస్తోంది.

ADVERTISEMENT
Latest Stories