ఈసారి ఎన్డీయే ప్రభుత్వం బొటాబోటి మెజార్టీతో కేంద్రంలో మళ్ళీ అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వ ఏర్పాటుకి 272 ఎంపీలు అవసరం కదా ఎన్డీయేకి 293 మాత్రమే ఉన్నారు. వారిలో టిడిపి, జనసేనలు కలిపి 18 మంది, బిహార్‌లోని నితీష్ కుమార్ ఆధ్వర్యంలోని జేడీయు 12 మంది ఎంపీలు ఉన్నారు.
కనుక వీరిలో ఎవరు పక్కకు తప్పుకున్నా మోడీ ప్రభుత్వం ప్రమాదంలో పడుతుంది. అయితే టిడిపి, జనసేనల నుంచి మోడీ ప్రభుత్వానికి ఎటువంటి సమస్య ఉండదు కానీ రాజకీయాలలో కప్ప గంతులు వేసే నితీష్ కుమార్ నుంచి ఎప్పటికైనా ప్రమాదం పొంచి ఉందనే అందరూ అనుమానిస్తున్నారు.
ఊహించిన్నట్లే మోడీ ప్రభుత్వానికి ఇంకా నెల రోజులు కూడా కాక ముందే అప్పుడే నితీష్ కుమార్ మొదటి అగ్నిపరీక్ష పెట్టారు.
ఈరోజు నితీష్ కుమార్ అధ్యక్షతన జేడీయూ జాతీయ కార్యవర్గ సమావేశంలో బిహార్‌కు ప్రత్యేక హోదా లేదా ప్రత్యేక ఆర్ధిక ప్యాకేజ్ ఇవ్వాలని తీర్మానం చేసి ఏకగ్రీవంగా ఆమోదించారు. దీని కోసం ఇదివరకే శాసనసభలో తీర్మానం చేసి ఆమోదించారు కూడా.
కనుక ఇదేమి కొత్త డిమాండ్ కాదని తాము ఎవరినీ బ్లాక్ మెయిల్ చేసేందుకు ప్రయత్నించడం లేదని ఆ పార్టీ సీనియర్ నేత, పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు సంజయ్ ఝా అన్నారు. దేశంలో వెనుకబడిన రాష్ట్రాలలో బిహార్ కూడా ఒకటని కనుక దాని అభివృద్ధి కోసమే ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతున్నామని అన్నారు. దీనిపై మోడీ ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని ఎదురుచూస్తామని అన్నారు.
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సి ఉండగా ఇచ్చే ప్రసక్తే లేదని మోడీ ప్రభుత్వం నిర్మొహమాటంగా చెపుతున్న సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు మోడీ ప్రభుత్వానికి నితీష్ కుమార్ మద్దతు చాలా అవసరం. అలాగని బిహార్‌కు ప్రత్యేక హోదా ఇస్తే అప్పుడు తప్పనిసరిగా ఏపీకి కూడా ఈయవలసి వస్తుంది. లేకుంటే రాష్ట్రంలో చంద్రబాబు నాయుడుపై రాజకీయ ఒత్తిడి మొదలవుతుంది. అప్పుడు ఆయన కూడా ప్రత్యేక హోదా కోసం పట్టుబట్టవలసి రావచ్చు.
ఒకవేళ ఏపీకి కూడా ఇస్తే అది అక్కడితో ఆగదు. దేశంలో చాలా రాష్ట్రాలు ప్రత్యేక హోదా అడుగుతున్నాయి. కనుక నితీష్ కుమార్‌కి ‘నో’ చెపితే ఆయన ఎన్డీయేకి గుడ్ బై చెప్పేసి వెళ్ళిపోయేందుకు సిద్దపడవచ్చు.
కానీ ఆయన మోడీ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటే, బిహార్‌లో ఆయన ప్రభుత్వానికి బీజేపీ కూడా మద్దతు ఉపసంహరించుకునే అవకాశం ఉంది.
ఈ విషయం తెలిసే నితీష్ కుమార్ ఈ డిమాండ్ చేస్తున్నారు అంటే దేనికైనా సిద్దమని చెపుతున్నట్లే భావించవచ్చు. కనుక ప్రధాని నరేంద్రమోడీ ఈ చిక్కుముడిని చాలా జాగ్రత్తగా విప్పవలసి ఉంటుంది.
నితీష్ కుమార్ తాజా డిమాండ్ నేపధ్యంలో ఎన్డీయే కూటమిలో చంద్రబాబు నాయుడు ప్రాధాన్యత ఇంకా పెరుగుతుంది. ఇది నలుగురు ఎంపీలున్న జగన్మోహన్ రెడ్డి కూడా మోడీని ప్రసన్నం చేసుకునేందుకు గొప్ప అవకాశం కల్పిస్తుంది.




